
టెల్ అవీవ్: గాజాలో యుద్ధాన్ని ముగించాలనే అనుకున్నామని, కానీ.. హమాస్ ను తుడిచిపెట్టకపోవడం వల్లే కంటిన్యూ చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ టెర్రరిస్టులు దాడి చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వార్తా సంస్థకు నెతన్యాహు ఇంటర్వ్యూ ఇచ్చారు.
గాజాలో ప్రారంభమైంది గాజాలోనే అంతమవుతుందన్నారు. తమ దేశ పౌరులను హమాస్ టెర్రరిస్టులు ఇంకా బందీగానే ఉంచారని, వారిని సురక్షితంగా విడుదల చేస్తే యుద్ధం ముగుస్తుందన్నారు. ‘‘అక్టోబర్ 7 అటాక్ తర్వాత ఇజ్రాయెల్ నాశనం అవుతుందని ప్రతిఒక్కరూ అనుకున్నారు. కానీ, మునుపటి కన్నా మేము బలంగా తయారయ్యాం. ఇరాన్ స్పాన్సర్ చేస్తున్న టెర్రరిస్టులను దాదాపు తుడిచిపెట్టేశాం. అయితే, హమాస్ ను ఇంకా పూర్తిగా అంతం చేయలేదు. ఆ లక్ష్యం కూడా పూర్తవుతుంది. మా దేశ బందీలు పూర్తిగా విడుదలైనపుడే యుద్ధం ముగిసినట్లు” అని నెతన్యాహు పేర్కొన్నారు.