సహకార ఉద్యమ కెరటం​ మల్లయ్య

సహకార ఉద్యమ కెరటం​ మల్లయ్య

సామాజిక సహకార ఉద్యమ నేత అంబటి లక్ష్మయ్య మల్లయ్య. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిత్యం అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.  ఫిబ్రవరి 25న నగరంలోని బండమైసమ్మలో వారి స్వగృహంలో  గుండెపోటుతో కన్నుమూశారు. బీసీ కులాల బంధువుగా గంగపుత్రులకు పెద్దదిక్కుగా ఉన్న మల్లయ్య లేని లోటు తీర్చలేనిది.  తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా మల్లయ్య బాల్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా బాలల సంఘాలను ఏర్పాటు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బాలల సంఘాల నాయకుడిగా యువతను చైతన్యపరిచారు. నిజాం పోలీసులకు, రజాకార్లకు కండ్లల్లో నలుసుగా మారారు. ఆయనపై ఆంక్షలు ఎక్కువ కావడంతో స్వగ్రామం నుంచి హైదరాబాదుకు కాలినడకన వచ్చారు.

గంగపుత్రుల కోసం విశేష కృషి

హైదరాబాదులో 1956లో ఆర్య సమాజ్ అధినేత రాజ్ పాల్ నాయకత్వంలో మల్లయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గంగపుత్రుల హక్కుల కోసం దశాబ్దాల పాటు రాజకీయాలకు అతీతంగా పనిచేశారు. మత్స్యకారుల సమస్యలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలమైన వాణి వినిపించారు. సర్దార్ మల్లయ్య గంగపుత్ర జాతికి భీష్ముడుగా నిలిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో సహకార సంఘాలను బలోపేతం చేశారు. బీసీ సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణ కోసం సర్దార్ గౌతుల లచ్చన్న  నాయకత్వంలో  కలిసి పోరాడారు. 1964 జనవరి 7న ప్రదేశ్ గంగపుత్ర సంఘం వ్యవస్థ అధ్యక్షులు సందడి బాలయ్య మృతితో,  తన 26వ ఏటా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గంగపుత్ర సంఘానికి ఆయన అనుబంధం విడదీయరానిది. 59 ఏండ్ల పాటు సంఘానికి సారథ్యం వహించారు.  చెరువులు, కుంటల పరిరక్షకుడుగా వ్యవహరించారు.  1979 నుంచి1982 వరకు తెలంగాణ మత్స్య పారిశ్రామిక కేంద్ర సహకార సంఘాల సంస్థల చైర్మన్ గా, 1992 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా గంగపుత్రుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిషరీస్ మెంబర్ గా  దేశవ్యాప్తంగా పర్యటించి మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. మత్స్యకారులకు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా మల్లయ్య చేసిన కృషి చిరస్మరణీయం. జాతికి స్ఫూర్తినిచ్చిన మల్లయ్య బడుగు బలహీన వర్గాలకు ఆదర్శమూర్తిగా ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయం కావాలి. 


 – డా. బి. లక్ష్మయ్య,  వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర గంగపుత్ర ఉద్యోగ సంఘం