పోలీసన్నా.. నీ సాయం మర్వలేదే!

పోలీసన్నా.. నీ సాయం మర్వలేదే!
  • తొమ్మిదేండ్ల కింద మహిళకు ఆపరేషన్ చేయించిన మహంకాళి ఏసీపీ రవీందర్
  • రోడ్డుమీదున్న ఎసీపీని గుర్తుపట్టి..
  • బస్సుదిగి పరుగెత్తుకొచ్చిన మహిళ
  • సికింద్రాబాద్​లో ఘటన

సికింద్రాబాద్, వెలుగు: సాయంచేస్తే.. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ముఖం చాటేసే ఈ రోజుల్లో.. తొమ్మిదేండ్ల కింద తన ప్రాణాలు నిలబెట్టిన పోలీసు అధికారిని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతలు చెప్పిందో మహిళ. తను బస్సులో వెళ్తుండగా, రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న అధికారిని చూసి గుర్తుపట్టి.. పరుగెత్తుకెళ్లి తన అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్.. 2014లో టప్పాచబుత్ర ఇన్​స్పెక్టర్​గా విధులు నిర్వహించారు. కార్వాన్​కు చెందిన కవిత అనే మహిళ రోడ్డుపై అనారోగ్యంతో బాధపడుతూ కనిపించింది. ఆమెను చూసి చలించిపోయిన రవీందర్.. తన సొంత డబ్బులతో హాస్పిటల్​లో చేర్పించారు. ఆపరేషన్ కూడా చేయించారు. తర్వాత కవిత కోలుకుంది. సాయంచేసిన రవీందర్.. మళ్లీ కవితకు కనబడలేదు. ఆదివారం బస్సులో వెళ్తున్న కవిత.. కిటికీ నుంచి చూడగా పోలీసు అధికారి రవీందర్ కనిపించారు. 

సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోగ్రామ్​లో ఏసీపీ రవీందర్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. వెంటనే డ్రైవర్​ను బస్సు ఆపాలని కోరిన కవిత.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఏసీపీ రవీందర్​ను కలిసింది. ‘నేను కార్వాన్​లో అనారోగ్యంతో రోడ్డుపక్కన పడి ఉన్న టైమ్​లో మీరే నాకు సాయం చేశారు’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. తొమ్మిదేండ్ల తర్వాత తన ప్రాణదాతను మళ్లీ కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేసింది. ‘ఈ రోజు నేను మీ ముందు నిలబడినా అంటే.. కారణం మీరే సారూ. పోలీస్ అన్నా.. నీ కోసం వెండి రాఖీ కొన్న.. వచ్చి కడ్తా. భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇంకా చాలా మందికి సాయం చేయాలె..’ అంటూ కవిత కన్నీరు పెట్టుకుంది. కవిత ఫోన్​లో ఏసీపీ ఫొటో చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏసీపీ ఫోన్ నంబర్ తీసుకొని కవిత తన ఇంటికి వెళ్లిపోయింది.