లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
  • మూడు దశాబ్దాల మహిళల కల సాకారం

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19వ తేదీన ప్రవేశపెట్టారు. బుధవారం (సెప్టెంబర్ 20న) దీనిపై చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు 
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఇద్దరు ఎంఐఎం ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను ఎంపీలకు అందజేశారు. అనంతరం ఓటింగ్‌ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్‌ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్‌’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టారు. 

మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించడంతో మూడు దశాబ్దాల మహిళల కల సాకారమైంది. కొత్త పార్లమెంటులో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే కోటా అమలుకానుంది.