- ధనిక ఫ్యామిలీల జాబితా విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్
- టాప్‌లో వాల్‌మార్ట్ ఓనర్ వాల్టన్ ఫ్యామిలీ
- ఆస్తి విలువ 16.34 లక్షల కోట్లు
- నిమిషానికి ₹50 లక్షలు, గంటకు 28 కోట్లు, రోజుకు 710 కోట్ల సంపాదన
- లిస్టులో అంబానీ ఫ్యామిలీకి 9వ ర్యాంక్.. 3.6 లక్షల కోట్ల ఆస్తి
పైసలున్నోళ్లు గంట గంటకు ఇంకా ఇంకా పెరుగుతున్నరు. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తులు సంపాదిస్తున్నరు. కానీ, పేదోడు మాత్రం ఎన్నేళ్లయినా అక్కడే ఉండిపోతున్నడు.ఆ దునియాల 99.46 లక్షల కోట్ల రూపాయల సంపద (1.4 లక్షల కోట్ల డాలర్లు) 25 మంది చేతులల్లనే ఉండడం అందుకు నిదర్శనం. ఆ జాబితాలో మన అంబానీ కూడా ఉన్నరు.టాప్10లో నిలిచిన్రు. ఇది బ్లూమ్‌బర్గ్ సర్వే చేసి తేల్చి చెప్పిన మాట. పైసలు మస్తుగున్న ఫ్యామిలీలపై ఆ కంపెనోళ్లు రిపోర్టిచ్చిన్రు. శనివారం ఆ రిపోర్టు విడుదలైంది.
జనాలు కాదు, కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. మరి, ప్రపంచంల పైసలు ఎక్కువ సంపాదిస్తున్న కుటుంబం లేదా వంశమేది? దానికి బ్లూమ్‌బర్గ్ చెబుతున్న జవాబు వాల్‌మార్ట్ ఓనర్స్ వాల్టన్ ఫ్యామిలీ. అవును మరి, ప్రతి గంటకు ఆ కుటుంబం సంపాదిస్తున్న పైసలెన్నో తెలుసా? సుమారు ₹28.42 కోట్లు. అమెరికా పైసలల్ల చెప్పాలంటే 40 లక్షల డాలర్లు. ఆ కంపెనీని పెట్టిన శాం వాల్టన్ వారసులు బాగానే కమాయిస్తున్నారు. వాళ్లు ప్రతి నిమిషానికి సుమారు ₹50 లక్షలు (70 వేల డాలర్లు) పోగేసుకుంటున్నారు. ఆ కుటుంబం ఒక్క రోజు సంపాదన సుమారు ₹710 కోట్లు (10 కోట్ల డాలర్లు). కానీ, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఓ సగటు ఉద్యోగి గంటకు సంపాదిస్తున్నది కేవలం ₹781 (11 డాలర్లు).
మొన్నమొన్నటిదాకా మార్ట్ కుటుంబం సంపాదన ₹13.57 లక్షల కోట్లు (19,100 కోట్ల డాలర్లు). కానీ, జూన్‌తో లెక్క మారిపోయింది. ఇప్పుడు వాళ్ల దగ్గరున్న పైసలు సుమారు ₹16.34 లక్షల కోట్లు (23,000 కోట్ల డాలర్లు). ఇక, ప్రపంచ ధనికులైన ఆ 25 మంది దగ్గరున్న సంపద గత ఏడాది ఇదే టైంతో పోలిస్తే ₹17.76 లక్షల కోట్లు పెరిగింది (25 వేల కోట్ల డాలర్లు). వాల్టన్ ఫ్యామిలీ తర్వాత ప్రముఖ చాక్లెట్ కంపెనీ ‘మార్స్’ ఫ్యామిలీ కూడా బాగానే సంపదను మూటగట్టుకుంది. వాళ్ల ఆస్తి సుమారు ₹9.02 లక్షల కోట్లు (12,700 కోట్ల డాలర్లు). గత ఏడాదితో పోలిస్తే ₹2.6 లక్షల కోట్లు (3700 కోట్ల డాలర్లు) పెరిగింది. క్రూడ్ ఆయిల్ కంపెనీ కోచ్ ఫ్యామిలీ ₹8.88 లక్షల కోట్ల (12,500 కోట్ల డాలర్లు) సంపదతో మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కొత్తగా సౌదీ అరేబియా రాజకుటుంబం చేరింది. ₹7.1 లక్షల కోట్ల (10 వేల కోట్ల డాలర్లు)తో నాలుగో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అంబానీ ఫ్యామిలీ తొమ్మిదో ర్యాంకును సంపాదించింది. 1957లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. 2002లో ఆయన చనిపోయాక, పెద్ద కొడుకు ముకేశ్ అంబానీ కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత ఆయన తమ్ముడు అనిల్ అంబానీ వేరుపడ్డారు. ప్రస్తుతం ముకేశ్ కుటుంబం సంపద ₹3.58 లక్షల కోట్లు (5040 కోట్ల డాలర్లు).

- వాల్టన్ ఫ్యామిలీ
వాల్‌మార్ట్ కంపెనీ వాళ్లదే. రిటైల్ మార్కెట్‌ను శాసిస్తోంది. ప్రపంచంలో దాదాపు 50% రిటైల్ మార్కెట్ ఆ కంపెనీ చేతుల్లోనే ఉంది. 1945లో అర్కాన్సస్లోని రోజర్స్లో తొలి స్టోర్‌ను శామ్ వాల్టన్ ప్రారంభించారు. ఆ స్టోర్ ఇప్పుడు వాల్‌మార్ట్ మ్యూజియం అయిందనుకోండి.
- మార్స్ ఫ్యామిలీ
స్నికర్స్ చాక్లెట్లు తెలుసు కదా. అలాంటి చాక్లెట్లను తయారు చేసే సంస్థ మార్స్. ఫ్రాంక్ మార్స్ ఈ చాక్లెట్ కంపెనీని పెట్టారు. ఆ కంపెనీ చాక్లెట్లు బాగా ఫేమస్ మరి, అందుకే ఇంత క్రేజ్.
- కోచ్ ఫ్యామిలీ
కోచ్ ఇండస్ట్రీస్‌కు ఓనర్. 1940లో ఫ్రెడ్ కోచ్ ఈ కంపెనీని పెట్టారు. ముడి చమురును రిఫైన్ చేసే సంస్థ ఇది. కర్గిల్ తర్వాత రెండో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఇది. ప్రస్తుతం ఆయన కుమారులు డేవిడ్ కోచ్, చార్లీ కోచ్ కంపెనీ వ్యవహారాలు చూస్తున్నారు.
- అల్ సౌదీ ఫ్యామిలీ
87 ఏళ్లుగా రాయల్ దివాన్ (రాజు ఆఫీసు) నుంచి వస్తున్న పైసలతో దాదాపు 7.1 లక్షల కోట్లు సంపాదించింది. ఒకవేళ రాజ కుటుంబంలోని 15 వేల ఫ్యామిలీలనూ కలిపితే ఆ సంపాదన చాలా చాలా పెరుగుతుందని అంచనా.
- వెర్థీమర్ ఫ్యామిలీ
1920లో వెర్థీమర్ ఫ్యామిలీ చానెల్ అనే కంపెనీని పెట్టింది. ప్రస్తుత ఓనర్లు అలైన్ వెర్థీమర్, జెరార్డ్ వెర్థీమర్ల తాత దీనిని పారిస్‌లో పెట్టారు. అయితే, రెండో ప్రపంచ యుద్ధం టైంలో నాజీల సాయంతో కోకో చానెల్,
వెర్థీమర్ కంపెనీని చేజిక్కించుకోవాలని చూసింది. ఆ కంపెనీ సంపాదన ₹4.09 లక్షల కోట్లు (5760 కోట్ల డాలర్లు)
- హెర్మ్స్ ఫ్యామిలీ
జీనల్ లూయీ డ్యూమస్ హెర్మ్స్ కంపెనీని 1837లో పారిస్‌లో పెట్టారు. ఫ్యాషన్ ప్రపంచంలో ఆ కంపెనీ పెద్దది. ఇప్పుడు పియర్ అలెక్సిస్ డ్యూమస్, యాక్సెల్ డ్యూమస్లు కంపెనీ బాధ్యతలు చూస్తున్నారు. కంపెనీ సంపద ₹3.77 లక్షల కోట్లు (5310 కోట్ల డాలర్లు)
- వాన్ డెమి ఫ్యామిలీ
1895లో వాన్డెమి ఫ్యామిలీ అన్హ్యూసర్ బుష్ ఇంబెవ్ అనే బీర్లు తయారు చేసే కంపెనీ పెట్టింది. బెల్జియం కేంద్రంగా అది పనిచేస్తోంది. ఆ ఫ్యామిలీ సంపద ₹3.75 లక్షల కోట్లు (5290 కోట్ల డాలర్లు).
- బోహ్రింగర్ ఫ్యామిలీ
జర్మనీకి చెందిన ఆల్బర్ట్ బోహ్రింగర్ ఓ చిన్న ట్రాక్టర్ ఫ్యాక్టరీని 1885లో కొన్నారు. ఇప్పుడు వోన్ బాంబక్స్తో కలిసిన కంపెనీ మరింత స్ట్రాంగ్ అయింది. ఆ కంపెనీకి హ్యబెర్టస్ వోన్ బాంబక్ చైర్మన్‌గా ఉన్నారు. వాళ్ల సంపద ₹3.68 లక్షల కోట్లు (5190 కోట్ల డాలర్లు).
- కర్గిల్, మెక్‌మిల్లన్
1865లో అమెరికాలోని మినెపొలిస్లో విలియం డబ్ల్యూ కర్గిల్ గ్రెయిన్ గోదామును పెట్టారు. అలా అలా తన కొడుకుతో కలిసి వ్యాపారాన్ని పెంచారు. కర్గిల్ కంపెనీని స్థాపించారు. వాళ్ల ఆస్తి విలువ సుమారు ₹3.04 లక్షల కోట్లు (4290 కోట్ల డాలర్లు).
