యువకుడి కిడ్నాప్ కు ఆస్తి తగాదాలే కారణం

 యువకుడి కిడ్నాప్ కు ఆస్తి తగాదాలే కారణం

హైదరాబాద్: సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో గడ్డి అన్నారం కార్పొరేటర్ పాత్ర ఉన్నట్లు యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  సరూర్ నగర్  పీ అండ్ టీ కాలనీ లో లంకా లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే మంగళవారం రాత్రి లక్ష్మీ నారాయణ కుమారుడు సుబ్రహ్మణ్యం(24)ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న సరూర్ నగర్ పోలీసులు గాలింపు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ఉదంతాన్ని చేధించారు. యువకుడిని కిడ్నాప్ చేసిన 9 మంది దుండగులను నల్గొండ జిల్లా చింతపల్లి  వద్ద ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు... కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కు యువకుడి తండ్రి లంకా లక్ష్మీ నారాయణకు కార్పొరేటర్ బంధువుతో అక్రమ సంబంధం ఉందని, ఆస్తి తగాదాలు కూడా కిడ్నాప్ కు కారణమని పోలీసులు తెలిపారు.