‘ఖాకీ’ సినిమా స్ఫూర్తితో పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ గౌతమ్ స్కూల్ ఏరియాలో జరిగిన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. 150 సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించిన లారీ ద్వారా దొంగల ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.నలుగురు సభ్యుల దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.12,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్తీ హీరోగా నటించిన ‘ఖాకీ’ సినిమా స్ఫూర్తితో లారీలలో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు గుడివాడ డీఎస్పీ సత్యానంద్ వెల్లడించారు. నలుగురు ముఠా సభ్యులపై వివిధ రాష్ట్రాల్లో 18పైగా కేసులు నమోదు అయ్యాయని అన్నారు. గుడివాడలో జరిగిన చోరీ కేసులో నగదు, ఆభరణాలను రికవరీ చేశామని, చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును చేధించి అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న రూరల్ సీఐ జయకుమార్, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.