అన్నదాతల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది

అన్నదాతల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారులో రైతులు 23వ రోజు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘ్, టిక్రీ దగ్గర రైతులు బైఠాయించారు. అలాగే ఢిల్లీ – ఉత్తరప్రదేశ్ లోను నిరసన కొనసాగుతోంది. కొత్తసాగు చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు రైతులు. మరికొన్ని రోజులు సరిహద్దుల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరోవైపు రైతుల పోరాటానికి మద్దతుగా తమిళనాడులో డీఎంకే పార్టీ ఒక రోజు నిరాహార దీక్ష చేస్తోంది. చెన్నైలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ సహా సీనియరు నేతలు దీక్షకు కూర్చొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను కేంద్రం దేశద్రోహులుగా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నామన్నారు స్టాలిన్. అన్నదాతల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.