22 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వేరియంట్

22 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వేరియంట్

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ వేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ్టి వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 961కి చేరింది. దీనికి సంబంధించిన వివరాలను ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్  కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తం 961 కేసులు రాగా.. అందులో 320 మంది పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఎనిమిది జిల్లాల్లో వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు 10 శాతాన్ని మించిపోయిందని, ఇందులో ఆరు జిల్లాలు మిజోరం రాష్ట్రంలో ఉండగా, మిగిలిన రెండు పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. వీక్లీ పాజిటివిటీ రేటు 5 నుంచి పది శాతం మధ్య 14 జిల్లాల్లో నమోదవుతోందన్నారు.

ఓవరాల్ పాజిటివిటీ రేటు 0.92 శాతం

గడిచిన వారం నుంచి దేశంలో ప్రతి రోజూ 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు. డిసెంబర్ 26 నుంచి రోజూ 10 వేలకు పైగా కేసులు వస్తున్నాయన్నారు. అయితే ఓవరాల్ పాజిటివిటీ రేటు 0.92 శాతమే ఉందన్నారు.

రాష్ట్రాల వారీగా ఒమిక్రాన్ కేసులు

రాష్ట్రం                   కేసుల సంఖ్య

ఢిల్లీ                             263

మహారాష్ట్ర                 252

గుజరాత్                      97

రాజస్థాన్                    69

కేరళ                           65

తెలంగాణ                 62

తమిళనాడు             45

కర్ణాటక                      34

ఆంధ్రప్రదేశ్             16

హర్యానా                   12

వెస్ట్ బెంగాల్            11

మధ్యప్రదేశ్             9

ఒడిశా                         9

ఉత్తరాఖండ్             4

చండీగఢ్                   3

జమ్ము కశ్మీర్            3

ఉత్తరప్రదేశ్             2

గోవా                            1

హిమాచల్ ప్రదేశ్     1

లడఖ్                         1

మణిపూర్                  1

పంజాబ్                     1