బీఆర్కేలో పేషీలున్నా..అక్కడో మంత్రి..ఇక్కడో మంత్రి

బీఆర్కేలో పేషీలున్నా..అక్కడో మంత్రి..ఇక్కడో మంత్రి
  • బీఆర్కే భవన్​లో పేషీలున్నావేరే ప్లేస్​ చూసుకుంటున్న మినిస్టర్లు
  • కమిషనరేట్లు, డైరెక్టరేట్లలో ఉండేందుకే మొగ్గు
  • మాసబ్ ట్యాంక్​కు వెళ్లనున్న కేటీఆర్, కోఠికి తరలనున్న ఈటల 
  • ఇప్పటికే ఎర్రమంజిల్​కు వేముల, బొగ్గులకుంటకు అల్లోల, హాకాభవన్కు నిరంజన్ షిఫ్టు
  • బీఆర్కే భవన్లోనే ఉండనున్న ఫైనాన్స్ మంత్రి హరీశ్
  • మంత్రులను కలిసేందుకు వచ్చేవారికి తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు:  మొన్నటిదాకా రాష్ట్ర మంత్రులందరి చాంబర్లు హైదరాబాద్​ నడిబొడ్డున విశాలమైన సెక్రటేరియెట్​లో ఉండేవి. మరి, ఇప్పుడు..?! అటు ఎర్రమంజిల్​లో ఒకరుంటే.. ఇటు కోఠిలో మరొకరు.. అటు బొగ్గులకుంటలో ఒకరుంటే.. ఇటు మాసబ్​ ట్యాంక్​లో మరొకరు.. ఇలా మంత్రులంతా  తమ తమ శాఖల కమిషనరేట్లకు, డైరెక్టరేట్లకు షిఫ్టవుతున్నారు. ఇప్పటికే కొందరు షిఫ్టయిపోగా.. మరికొందరు ఆ పనిలో ఉన్నారు. పాత సెక్రటేరియెట్​ను కూల్చి దాని స్థానంలో కొత్త సెక్రటేరియెట్​ను కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అందులోని ఆఫీసులతోపాటు మంత్రులందరి చాంబర్లను బీఆర్కే భవన్​లో ఏర్పాటు చేశారు. సెక్రటేరియెట్​ సిబ్బంది అంతా బీఆర్కే భవన్​కు షిఫ్టయ్యారు.  వారంరోజుల నుంచి వారంతా అక్కడే డ్యూటీ చేస్తున్నారు. బీఆర్కే భవన్​లోని ఫస్ట్ ప్లోర్ లో పాత, కొత్త మంత్రులందరికీ చాంబర్లను కేటాయించారు. వాటిల్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయిస్తున్నారు. వచ్చే వారం అన్ని చాంబర్లు అందుబాటులోకి రానున్నాయి. కానీ మంత్రులెవరూ బీఆర్కే భవనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బీఆర్కే బిల్డింగ్ బాగోలేదని, వాతావరణం కూడా మంచిగలేదని వెనుకడుగు వేస్తున్నారు. తమ తమ శాఖల పరిధిలోని కమిషనరేట్లు, డైరెక్టరేట్ల నుంచి విధులు నిర్వహించేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. చాలా కమిషనరేట్లలో ఏపీకి కేటాయించిన ఫ్లోర్లు తిరిగి తెలంగాణకే వచ్చాయి. అవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.  పైగా విశాలంగానూ ఉన్నాయి. అందుకే వాటిల్లోనే చాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

వేములతో మొదలు

సెక్రటేరియెట్​ తరలింపు ఆగస్టు 7న ప్రారంభమైంది. అదేరోజు ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన చాంబర్ ను ఎర్రమంజిల్​లోని ఈఎన్సీ కార్యాలయానికి తరలించారు. అక్కడ్నుంచే పనిచేస్తున్నారు. ఈఎన్సీ బిల్డింగ్ రెండేండ్ల క్రితం నిర్మించడంతో అందులో ఆధునిక వసతులతో విశాలమైన చాంబర్లు ఉన్నాయి. వేముల ఈఎన్సీకి తన చాంబర్​ను షిఫ్టు చేసుకోవడంతో మిగతా మంత్రులు అదే బాట పట్టారు.

బొగ్గులకుంటలో ఇంద్రకరణ్

బొగ్గులకుంటలో దేవాదాయ శాఖ కమిషనరేట్ ఉంది. అక్కడికి దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  షిఫ్ట్​ అయ్యారు. అక్కడే శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి ముందుగా సెక్రటేరియెట్​కు దగ్గర్లో ఉన్న అరణ్య భవన్ కు షిఫ్ట్​ కావాలని అనుకున్నారు. కానీ సౌకర్యాలు బాగోలేవన్న కారణంతో బొగ్గులకుంటకు మారిపోయారని అధికారులు అంటున్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ఆఫీసుకు ఈటల!

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ ఆఫీసులో చాంబర్​ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న డెంగీ జ్వరాలపై ఇటీవల ఆయన ఆ ఆఫీసు నుంచే సమీక్ష నిర్వహించారు.

మాసబ్​ ట్యాంక్​కు కేటీఆర్!​

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుగా ఖైరతాబాద్ లోని వాటర్​ బోర్డు ఆఫీసుకు చాంబర్ ను షిఫ్ట్​ చేయాలని అనుకున్నారు. కానీ మాసబ్ ట్యాంక్ లోని మున్సిపల్ కమిషనరేట్ కార్యాలయం అన్ని వసతులతో ఉండటంతో అక్కడికే చాంబర్ ను మార్చాలని తన సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజునుంచి వరుసగా రెండురోజుల పాటు మాసబ్​ట్యాంక్​ మున్సిపల్ కమిషనరేట్​లోనే కేటీఆర్​ సమీక్షలు జరిపారు.

హాకాభవన్​కు నిరంజన్​

ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డి తన ఆఫీసును అసెంబ్లీ ఎదురుగాఉన్న హాకా భవన్ కు తరలించారు. బీఆర్కే భవన్ లో చాంబర్ పూర్తయినా అక్కడికి వెళ్లే ఆలోచనలో ఆయన లేరని ఓ అధికారి తెలిపారు.

బీఆర్కే భవన్​కు హరీశ్​ మాత్రమేనా?

మంత్రులందరూ వేర్వేరు చోట్లకు షిఫ్టవుతుండగా ఒక్క ఫైనాన్స్​ మంత్రి హరీశ్​ మాత్రమే బీఆర్కే భవన్​లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఒకే మంత్రి వద్ద ఉండేవి. ఇప్పడు ఫైనాన్స్ శాఖ మాత్రమే హరీశ్​ వద్ద ఉంది. ఫైనాన్స్​ శాఖకు సెక్రటేరియెట్​లో  కాకుండా బయట ఎక్కడ ఆఫీసు లేదు. దీంతో హరీశ్​ రావు  బీఆర్కే భవన్ లో తనకు కేటాయించిన చాంబర్ లోకి వెళ్లాల్సిందేనని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఎవరి దారి వారిదే..!

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఎస్సీఆర్టీ ఆఫీసుకు వెళ్లే యోచనలో ఉన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి  విద్యుత్ సౌధకు వెళ్లే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయానికి షిఫ్టు కావాలని భావిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు అంటున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్  ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్టు బిల్డింగ్ లేదా బస్ భవన్ కు  షిఫ్ట్​ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఆర్కే భవన్ లో  చాంబర్​ రిపేర్లు ఇంకా పూర్తికాలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అప్పటి వరకు మాసబ్ ట్యాంక్ లోని కమిషనరేట్ లో రివ్యూలు చేస్తున్నట్లు తెలిపారు.  బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్  మాసబ్ ట్యాంక్ లోని బీసీ కమిషనరేట్ లో చాంబర్ ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ బీఆర్కే  భవన్​కు వెళ్లాలా..? లేక డీజీపీ కార్యాలయానికి వెళ్లాలా? అని ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎక్కడికి వెళ్లాలో మంత్రి నిర్ణయం తీసుకుంటారని ఆయన పేషీ సిబ్బంది చెప్తున్నారు. టూరిజం  మంత్రి శ్రీనివాస్ గౌడ్​ హైదర్ గూడలోని తన శాఖకు చెందిన కమిషనరేట్​కు షిఫ్టు అయ్యే చాన్స్​ ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  మాసబ్ ట్యాంక్ లోని ఆ శాఖ డైరెక్టరేట్ కు వెళ్లే అవకాశం ఉందని అదే శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్​ చాంబర్లు బీఆర్కే భవన్​లో ఉంటాయా లేక మరే చోటికి షిప్టు అవుతాయన్నది తేలలేదు. త్వరలోనే మంత్రుల చాంబర్లు ఎక్కడన్నది క్లారిటీ రానుంది.

మా మంత్రి ఏడున్నడో..!

ఇటీవల కొత్తగా ఆరుగురు మంత్రులయ్యారు. తమ ఎమ్మెల్యేలు  మంత్రులయ్యారన్న ఆనందంతో జిల్లాల నుంచి చాలా మంది నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్​ వచ్చారు. కొత్త మంత్రులను కలిసి అభినందించాలని ఉత్సాహం చూపారు. కానీ హైదరాబాద్ కు వస్తే ఆ మంత్రుల జాడ కనిపెట్టడం పెద్ద చాలెంజ్ గా మారిందని ఉత్తర తెలంగాణ కు చెందని ఓ నాయకుడు అన్నారు. ‘‘లేక లేక  మంత్రి అయ్యిండని పూల దండలు కొన్నం. మంత్రి కనపడగానే దండ వేసి జై కొట్టాలని అనుకున్నం. ఇంటికి పోతే అక్కడ సార్ కనపడలె. ఆఫీసుకు పోయిండని చెప్పిన్రు.  ఏ ఆఫీసని అడిగితే ఏమో అన్నరు” అని ఓ కొత్త మంత్రి అభిమాని తన బాధ వెళ్లగక్కుకున్నాడు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి