
డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇన్సులిన్ ఇస్తుంటారు. అయితే, ఇందులో రకాలు కూడా ఉన్నాయి. అవి ఒక్కోటి ఒక్కో వేగంతో పనిచేస్తాయి. వాటి రకాలు, అవి ఎంత వేగంగా పనిచేస్తాయి. ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఎంతకాలం ఉంటాయి అనేది కింది బాక్స్‌లో చూడొచ్చు. ఇన్సులిన్ని తీసుకునే పద్ధతిలో కూడా రకాలున్నాయి. అవేంటంటే... నీడిల్ – సిరంజ్, ఇన్సులిన్ పెన్, లేదా ఇన్సులిన్ పంప్. ఇన్హేలర్స్, ఇన్సులిన్ జెట్ ఇంజెక్టర్స్ అనేవి చాలా అరుదుగా తీసకునే పద్ధతులు. ఇన్సులిన్ పెన్, చూడ్డానికి రాసే పెన్లాగే కనిపిస్తుంది. కానీ, దానికి సూదిలాంటి మొన ఉంటుంది. కొన్ని పెన్లు ఇన్సులిన్ కలిగి ఉంటాయి. వాటిని మళ్లీ వాడకూడదు. కొంతమంది దగ్గర ఇన్సులిన్ క్యాట్రిడ్జ్ కోసం ఒక గది ఉంటుంది. అక్కడ ఇన్సులిన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. రీప్లేస్ చేసి మళ్లీ వాడుకోవచ్చు. ఈ పెన్‌లలో కూడా వేర్వేరు ఫీచర్స్‌తో కొన్ని రకాలుంటాయి. కొన్ని రీయూజబుల్ పెన్స్లో మెమరీ ఫంక్షన్ ఉంటుంది. అంటే, డోస్ ఎమౌంట్స్, టైమింగ్స్‌ని అది గుర్తు చేస్తుందన్నమాట. మరో రకం పెన్‌లలో అయితే, ఇన్సులిన్ డోస్‌లను క్యాలిక్యులేట్ చేసి, డేటా రిపోర్ట్‌ను డౌన్లోడ్ కూడా చేసుకునే వీలుంది.
పంప్
ఇన్సులిన్ పంప్ అనేది చిన్న మెషిన్లా ఉంటుంది. అది రోజు మొత్తానికి కావాల్సిన డోస్‌లు ఇస్తుంది. శరీరానికి బెల్ట్ లేదా పాకెట్ లేదా పౌచ్లా ఈ పంప్ ధరించొచ్చు. ఇన్సులిన్ పంప్ ప్లాస్టిక్ ట్యూబ్‌కి కనెక్ట్ చేసి ఉంటుంది. దానికి చిన్న సూది కూడా ఉంటుంది. దాని సాయంతో చర్మంలోకి గుచ్చి, సూదిని తీయాలి. అప్పుడు ప్లాస్టిక్ ట్యూబ్ కొన్నిరోజులపాటు అలానే ఉంటుంది. ఆ మెషిన్ 24 గంటలు ఇన్సులిన్‌ను పంప్ చేస్తూనే ఉంటుంది. అందులో ప్రోగ్రామ్ చేసిన విధంగా ఎక్కువ లేదా తక్కువగా శరీరానికి కావాల్సినంత అది ఇస్తూ ఉంటుంది. దీని ద్వారా మీల్స్ టైంలో కూడా ఇన్సులిన్ తీసుకోవచ్చు. మరో రకం పంప్‌కి ట్యూబ్స్ అనేవి ఉండవు. ఇది సెల్ఫ్ అడ్హెసివ్గా ప్యాడ్లా చర్మానికి అతుక్కునే ఉంటుంది. ఇది చేతికి పెట్టుకునే డివైజ్. ప్లాస్టిక్ ట్యూబ్, పంప్ డివైజ్‌లు కొన్ని రోజులకు ఒకసారి మారుతూ ఉంటాయి.
నీడిల్ – సిరంజ్
ఇన్సులిన్ని సూది ద్వారా అయితే బొడ్డు దగ్గర ఇంజెక్ట్ చేసినప్పుడు వేగంగా పనిచేస్తుంది. లేదంటే వేరే ప్రదేశంలో అయినా చేసుకోవచ్చని డాక్టర్ సూచిస్తాడు. ఏదైనాగానీ, ఒకేచోట ఇంజెక్ట్ చేయడం వల్ల అక్కడ ఉండే కణజాలం (టిష్యూ) గట్టిపడుతుంది. ఆ తర్వాత మళ్లీ అక్కడ ఇన్సులిన్ షాట్ వేయడానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఇన్సులిన్ని తొడ, పిరుదులు లేదా చేతిపై వేయొచ్చు అని చెప్తారు. అయితే, ఈ ప్రాంతాల నుంచి ఇన్సులిన్ పనిచేయడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. ఇన్సులిన్ తీసుకునే పేషంట్స్‌కి వాళ్ల రక్తంలో గ్లూకోజ్ టార్గెట్స్‌ని చేరుకోవడానికి రోజుకు 2–4 షాట్లు అవసరం.
ఇన్హేలర్
పౌడర్ రూపంలో ఉండే ఇన్సులిన్ని నోటితో శ్వాస పీల్చడం ద్వారా తీసుకోవచ్చు. దీనికి ఇన్హేలర్ డివైజ్ అని ఒకటి ఉంటుంది. దీని ద్వారా తీసుకున్నప్పుడు ఇన్సులిన్ నేరుగా లంగ్స్‌కు వెళ్తుంది. ఆ తర్వాత వెంటనే రక్తంలో కలుస్తుంది. ఇన్సులిన్ ఇన్హేలర్ వాడాలి అనుకుంటే సూది ద్వారా తీసుకోవడం మానేయాలి. ఇది టైప్ 1 లేదా టైప్ 2 ఉన్న పెద్దవాళ్లకు మాత్రమే. ఇది ఎక్కువగా వాడకంలో లేదు.
జెట్ ఇన్‌జెక్టర్
జెట్ ఇన్‌జెక్టర్ అనే డివైజ్ ద్వారా ఇన్సులిన్ని చర్మంపై ఎక్కువ ప్రెజర్‌తో స్ప్రే చేస్తారు. దీన్ని కూడా సిరంజ్‌లు, పెన్‌ల కంటే చాలా తక్కువగా వాడుతున్నారు.
ఆర్టిఫీషియల్ పాంక్రియాస్
మన బాడీలో ఆరోగ్యంగా ఉన్న పాంక్రియాస్ బ్లడ్ గ్లూకోజ్‌ని ఎలాగయితే కంట్రోల్ చేస్తుందో అచ్చం అలానే ఆర్టిఫీషియల్ పాంక్రియాస్లో పనిచేస్తుంది. ఇందులో మూడు డివైజ్‌లు ఉన్నాయి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ (సీజీఎం) అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి చిన్న సెన్సర్ ద్వారా చర్మంలోకి ఇన్సర్ట్ చేస్తుంది. సీజీఎం అనేది ఇన్ఫర్మేషన్ని ప్రోగ్రామ్ చేసి స్మార్ట్‌ఫోన్‌కి లేదా ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పంప్‌కి పంపిస్తుంది. ఆ ప్రోగ్రామ్‌లో ఎంత ఇన్సులిన్ కావాలి అనేది క్యాలిక్యులేట్ చేసి ఉంటుంది. ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పంప్‌ని బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని బట్టి టార్గెట్ రేంజ్‌ని అడ్జస్ట్ చేయొచ్చు. ఈ ఆర్టిఫీషియల్ పంప్‌ని టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్ల కోస్ ఉపయోగిస్తారు.
ట్రీట్మెంట్లు
మెడిసిన్స్, లైఫ్ స్టైల్ ఛేంజెస్ డయాబెటిస్‌ని మేనేజ్ చేయలేనప్పుడు వేరే రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. అవేంటంటే.. టైప్1, 2 ఉన్నవాళ్లకు వెయిట్ లాస్ సర్జరీ (బేరియాట్రిక్) చేస్తారు. లేదంటే టైప్1 ఉన్న వాళ్లలో కొంతమందికి పాంక్రియాటిక్ ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు.
వెయిట్‌లాస్ సర్జరీ
ఈ సర్జరీ వల్ల ఒబెసిటీ, టైప్ 2 డయాబెటిస్ రెండు ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది. బరువు తగ్గడంతోపాటు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ హెల్దీ రేంజ్‌లోకి తీసుకురావడానికి సాయపడుతుంది. ఇందులో రిజల్ట్ అనేది ఒక్కో పేషెంట్‌కి ఒక్కోలా కనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తి బరువు ఎంత? డయాబెటిస్ ఎప్పటి నుంచి ఉంది? ఇన్సులిన్ వాడారా? లేదా? అనే అంశాలను బట్టి ఎంత తగ్గాయనేది చూస్తారు. కొంతమంది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు వెయిట్ లాస్ అయ్యాక, ఎక్కువ కాలం డయాబెటిస్ మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా రాదు. టైప్1డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఈ సర్జరీ ఉపయోగపడుతుందా? లేదా? అనే దానిపై రీసెర్చ్ జరుగుతోంది.
పాంక్రియాటిక్ ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
పాంక్రియాటిక్ ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది టైప్ 1 డయాబెటిస్ ఉన్నవాళ్ల మీద ప్రయోగం చేశారు. పాంక్రియాస్లో ఉన్న కణాల గుంపు ఇన్సులిన్ హార్మోన్‌ను తయారుచేస్తుంది. ఆ గుంపులనే పాంక్రియాటిక్ ఐలెట్స్ అంటారు. టైప్ 1 డయాబెటిస్‌లో ఈ కణాలు ఇమ్యూన్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది. నశించిన ఐలెట్స్ని రీప్లేస్ చేయడానికి ఆర్గాన్ డోనర్ నుంచి కొత్త ఐలెట్స్ తీసుకుని పాంక్రియాటిక్ ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. ఆ కొత్త ఐలెట్స్ అనేవి ఇన్సులిన్ని తయారుచేసి, రిలీజ్ చేస్తాయి. ప్రస్తుతానికి దీని మీద రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. కాబట్టి, అందులో భాగంగా కొందరికే ఈ ట్రీట్మెంట్ అందుతుంది. ఇంకా డయాబెటిస్ ట్రీట్మెంట్లపై రీసెర్చ్‌లు, క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. వాటి రిజల్ట్ కోసం ఇంకొన్నాళ్లు ఎదురుచూపు తప్పదు.
బీ కేర్ ఫుల్
డయాబెటిస్ ఉన్న వాళ్లలో మ్యాక్రో వ్యాస్కులార్, మైక్రో వ్యాస్కులార్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రో వ్యాస్కులార్ కాంప్లికేషన్స్ అంటే.. కళ్లు, నరాలు, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. వీటినే వైద్య భాషలో రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి అంటారు.
మ్యాక్రో వ్యాస్కులార్ కాంప్లికేషన్స్‌లో... హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, వచ్చిన తర్వాత సరిగా మానకపోవడం లాంటి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అవి ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ వంటివి. వాటి వల్ల మరణాలు జరిగే ప్రమాదం ఉంది. అలాగే మగవాళ్లలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనే లైంగిక సమస్య కూడా వస్తుంది. పాదాలకు పుండ్లు పడడం, తగ్గకపోవడం, రక్త ప్రసరణ జరగకపోవడం వంటివి కనిపిస్తాయి. కళ్లలో కాటరాక్ట్ సమస్యలు కూడా చాలా త్వరగా, ఎక్కువగా వస్తుంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల అది కణాల మీద చెడు ప్రభావం చూపిస్తుంది.
డయాబెటిస్ వస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ మూడింటినీ కంట్రోల్లో ఉంచుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. చాలామంది షుగర్ వస్తే దాన్ని మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారు. కానీ, దాంతోపాటు బీపీ, కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేసుకోవాలి.
టెస్ట్‌లు తప్పనిసరి
లైఫ్ స్టయిల్ మార్పులు తప్పనిసరి. సరైన ఫుడ్‌ని సరైన మోతాదులో తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ కనీసం 40 నిమిషాలు స్పీడ్‌గా నడవాలి. లేదంటే ఈత కొట్టడం, షటిల్ ఆడటం వంటివి చేయొచ్చు. సరైన టైంకి నిద్ర పోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. వీటితోపాటు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో హెచ్‌బిఎ1సి అనే టెస్ట్ చేస్తారు. అందులో మూడు నెలల యావరేజ్ చూస్తారు. దాంతో పాటు కొలెస్ట్రాల్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే యూరిన్ టెస్ట్– యూరిన్‌లో ప్రొటీన్ లీక్ ఉందా? అని తెలుసుకునే పరీక్షలు చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఈసీజీ, కంటి పరీక్షలు చేయాలి. పాదాల్లో స్పర్శ సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి న్యూరోపతి స్క్రీనింగ్ చేయాలి. అంతేకాకుండా బ్లడ్‌లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంటుందో అంటే.. కొలెస్ట్రాల్ చెక్ చేయాలి. ఇలా సరైన పరీక్షలు సకాలంలో చేసుకుంటే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే ముందుగానే తెలుస్తాయి. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
మందులు, ఇన్సులిన్లు, ఇంజెక్షన్లు ఉన్నాయి. ఉన్న సమస్యలని బట్టి ట్రీట్మెంట్ చేసే పద్ధతి ఉంటుంది. అవసరమైన మెడికేషన్ ఇస్తారు. దీంతోపాటు బీపీ, కొలెస్ట్రాల్‌కు కూడా మందులు వాడాలి.
పాంక్రియాస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది అరుదుగా టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్లలో చేస్తారు. అలాగే ఐలెట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అది కూడా చాలా అరుదుగా చేస్తారు.
ఒబెసిటీ, షుగర్ రెండూ ఉన్న వాళ్లకు బేరియాట్రిక్ సర్జరీ చేస్తారు. దానివల్ల బరువు తగ్గి షుగర్ తగ్గుతుంది. దాన్నే మెటబాలిక్ సర్జరీ అని కూడా అంటారు.
డయాబెటిక్ రివర్స్ చేయడం అనేది కొందరిలో సాధ్యమవుతుంది. అది ఎవరికంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చి ఇన్సులిన్ వాడకుండా ఆరేండ్లు లోపు ఉంటే రివర్స్ చేయొచ్చు. ఆరేండ్ల తరువాత అయితే రివర్స్ చేయడం కష్టం. టైప్ 1 వాళ్లలో డయాబెటిస్ రివర్స్ చేయడం సాధ్యపడదు. వేరు వేరు మందులు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వాడితే కిడ్నీలు, లివర్ కూడా పాడవ్వచ్చు.
ఆల్టర్నేటివ్ మెడిసిన్: ఇప్పటివరకు డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేసేందుకు కొత్త మెడిసిన్స్ ఏం రాలేదు. కొందరు డయాబెటిక్ పేషెంట్లు రెండు రకాల మందులు వాడుతుంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే రెండు రకాల మందులు వాడితే, అవి ఎలా రియాక్ట్ అవుతాయో? ఎలాంటి నష్టం జరుగుతుందో చెప్పలేం. కొన్ని సార్లు వేరే మందులు వాడడం వల్ల కిడ్నీలు పాడవ్వొచ్చు. అలాగే డ్రగ్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అంటే రెండు మందులకు మధ్య ఉండే ఇంటరాక్షన్. అది కూడా రీసెర్చ్ చేయకుండా ఎలాపడితే అలా వాడకూడదు. షుగర్ కంట్రోల్లో లేకపోతే కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. అలాంటప్పుడు షుగర్‌ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే మెట్‌ఫామిన్ వాడే వాళ్లలో విటమిన్ –బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ లోపం వల్ల కూడా నరాల బలహీనత రావచ్చు. కాబట్టి దాన్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విటమిన్ తక్కువగా ఉంటే దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. అంతేకాకుడా కాళ్ల తిమ్మిర్లు ఉన్నవాళ్లలో స్పర్శ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లు చెప్పులు లేకుండా నడవకూడదు. అలా నడిస్తే, కాళ్లకు పుండ్లు పడే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎండలో చెప్పుల్లేకుండా నడిస్తే పుండ్లు పడి, ఒక్కోసారి కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అంటే చెప్పులు లేదా షూ వాడాలి. అవి కూడా కాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేవే తీసుకోవాలి.
– డా. రవి శంకర్ యిరుకులపాటి సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్