సైన్మా చూసిండు రికార్డులకి ఎక్కిండు

సైన్మా చూసిండు రికార్డులకి ఎక్కిండు

గిన్నిస్‌‌ బుక్‌‌లోకి ఎక్కాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫ్లోరిడాలో ఉండే రామిరో అలానిస్ కూడా అదే చేశాడు. ఇతనికి సినిమాలంటే పిచ్చి. ముఖ్యంగా ‘మార్వెల్‌‌ మూవీస్‌‌’కు పెద్ద అభిమాని. మార్వెల్‌‌ ప్రొడక్షన్స్‌‌ నుండి ఏ సినిమా వచ్చినా తప్పకుండా థియేటర్‌‌‌‌లో చూసేవాడు. అలా రీసెంట్‌‌గా వచ్చిన ‘స్పైడర్‌‌‌‌ మాన్– నో వే హోమ్‌‌’ సినిమాను థియేటర్‌‌‌‌లో ఎక్కువ సార్లు చూసినందుకు ఈ రికార్డ్ దక్కింది. ఈ రికార్డ్ క్రియేట్‌‌ చేయడానికి దాదాపు 3 నెలల టైం పట్టింది. అంటే రోజుకు 12 గంటల 20 నిమిషాలు సినిమా చూసేవాడు. ఇదొక్కటే కాదు ఇంతకు ముందు కూడా ఇలా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. దాన్నే ఇప్పుడు తిరగ రాశాడు. 

‘రికార్డ్‌‌ కొట్టాలన్నా నేనే. దాన్ని తిరగరాయాలన్నా నేనే’ అనే డైలాగ్‌‌ను బాగా ఫాలో అయినట్టున్నాడు రామిరో. ఎందుకంటే ఇదివరకు 2019లో ‘అవెంజర్స్‌‌: ఎండ్‌‌ గేమ్‌‌’ను 191 సార్లు చూసినం దుకు గిన్నిస్ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్ రికార్డ్‌‌లోకి ఎక్కాడు. కానీ 2021లో ఆర్నాడ్‌‌ క్లైన్‌‌ అనే అతను ‘కామెలోట్‌‌: ఫస్ట్‌‌ ఇన్‌‌స్టాల్‌‌మెంట్‌‌’ సినిమాను 204 సార్లు చూసి ఆ రికార్డ్‌‌ను బద్ధలు కొట్టాడు.  అందుకు కొన్ని రోజుల వరకు చాలా బాధపడ్డాడు రామిరో.

నాన్నమ్మ సపోర్ట్‌‌తో..

రామిరో నాన్నమ్మ జువానికి  రామిరో అన్నిట్లో ఫస్ట్‌‌ ఉండాలని కోరిక. తన రికార్డ్‌‌ చెరిగి పోయింది అని బాధ పడుతున్న రామిరోకి సపోర్ట్‌‌ చేసింది. ‘ఇది పోతే ఏంటి? కొత్తగా ఇంకొకసారి ప్రయత్నించు’ అని ప్రోత్సహించింది. దాంతో అప్పుడే వచ్చిన ‘స్పైడర్‌‌‌‌ మాన్: నో వే హోమ్‌‌’  సినిమాను చూసి కొత్త రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేయాల నుకున్నాడు. సినిమాని థియేటర్లో వేయడం ఆపేవరకు బ్యాక్- టు- బ్యాక్ స్క్రీనింగ్‌‌ చూసేవాడు. అందుకోసం ప్రతిరోజూ 5  స్క్రీనింగ్‌‌లు చూశాడు. కొన్నిసార్లు థియేటర్‌‌‌‌లోనే పడుకునేవాడు. సినిమా చూస్తూ మొబైల్‌‌ చూడటం, బాత్‌‌రూమ్‌‌ బ్రేక్స్‌‌, కునుకు తీయటం లాంటివి చేస్తే డిస్‌‌ క్వాలిఫై అయినట్టు. అలా 11 సార్లు డిస్‌‌ క్వాలిఫై అయ్యాడు కూడా. గిన్నిస్‌‌ రూల్స్‌‌ ప్రకారం సినిమా చూస్తున్నంతసేపు ఎలాంటి బ్రేక్స్ తీసుకోకూడదు. ఇతని ప్రయత్నం చూసి థియేటర్ వాళ్లు రామిరో కోసం రోజూ ఒక టికెట్‌‌ పక్కన పెట్టేవాళ్లు. 

అలా మొత్తం 292 సార్లు ఈ సినిమా చూసేసరికి మొత్తం 3,400ల డాలర్ల ఖర్చు అయింది. 
అంటే మన కరెన్సీలో దాదాపు 2,59,074 రూపాయలు. ఈ ప్రయత్నంలో 7.25 కిలోల బరువు తగ్గాడట. ‘ఇకముందు ఎవరైనా నా రికార్డ్‌‌ బ్రేక్‌‌ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి’ అని రామిరో తన ట్విట్టర్‌‌‌‌ అకౌంట్‌‌లో పోస్ట్ చేశాడు.