తెలంగాణలో గుడులు, బడులకన్నా.. బార్లు, బీర్లే ఎక్కువ : షర్మిల

తెలంగాణలో గుడులు, బడులకన్నా.. బార్లు, బీర్లే ఎక్కువ : షర్మిల
  • కేసీఆర్​ మోసం చేయని వర్గం లేదు
  • వైఎస్సార్ సంక్షేమ పాలనను తిరిగి తీసుకువస్తానని వెల్లడి

సైదాపూర్/హుజూరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు గౌరవం లేకుండా పోయిందని.. పాలకులు బంగారు తెలంగాణ పేరు చెప్పి బతకలేని తెలంగాణగా మార్చారని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని  వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ‘వైఎస్సార్​సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. వైఎస్సార్​ కూతురుగా మీ ముందుకు వచ్చాను. నన్ను ఆదరిస్తే వైఎస్​రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలనను తిరిగి తీసుకువస్తా..’ అని పేర్కొన్నారు. షర్మిల తలపెట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కరీంనగర్​ జిల్లా మానకొండూర్​నియోజకవర్గం నుంచి హుస్నాబాద్​ నియోజకవర్గం పరిధిలోని సైదాపూర్​ మండలం బూడిదపల్లి, సైదాపూర్, జాగిరిపల్లి, రాంచంద్రాపూర్, చింతలపల్లి, ఎలబోతారం మీదుగా హుజూరాబాద్​ నియోజకవర్గానికి చేరుకుంది. షర్మిల పాదయాత్ర శుక్రవారం 213వ రోజు.. 3,300 మైలురాయిని చేరుకున్న సందర్భంగా బోర్నపల్లిలో వైఎస్సార్​విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్​ ప్రతీ మాటలో మోసం దాగుందని, ఆయన మోసం చేయని వర్గం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేదని.. తాలు, తరుగు అని రైతులను నిండా ముంచుతున్నరన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేండ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కౌలు రైతును తెలంగాణలో రైతే కాదంటున్నారని విమర్శించారు. -కేసీఆర్​పాలనలో గుడులు బడులకన్నా బార్లు, బీర్లు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్​ ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతిపక్షాలు కళ్లు మూసుకుని ఉన్నందునే కేసీఆర్​ ఆగడాలు సాగుతున్నాయన్నారు.

ఉద్యోగాల పేరుతో ఎనిమిదేండ్లుగా మోసం..

రాష్ట్ర యువతను ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో 8 ఏండ్లుగా మోసం చేస్తోందని షర్మిల ఫైర్​ అయ్యారు. నోటిఫికేషన్ లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కేసీఅర్ లో చలనం లేదన్నారు. ఇదే నియోజక వర్గంలో షబ్బీర్ అనే యువకుడు రైలు కింద పడి చనిపోయాడని గుర్తు చేశారు. పార్టీలు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని, పార్టీల్లో మాట మీద నిలబడే నాయకుడేలేకుండా పోయాడన్నారు.  ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజగోపాల్, నాయకులు మల్లికార్జున్​రెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్​చార్జ్​ శివనాగేంద్ర నాయక్​ తదితరులు పాల్గొన్నారు.