టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకే దళిత బంధు

టీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలకే దళిత బంధు
  •  అసెంబ్లీ నియోజకవర్గానికి 500 యూనిట్లే లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మళ్లీ ఎమ్మెల్యేలకే 
  • రూలింగ్​ పార్టీలోనూ  దళితబంధు కోసం కొట్లాటలు
  •   తమ వంతు ఎన్నేండ్లకు వస్తదో తెలియక  సామాన్య దళితుల ఆవేదన
  • మళ్లీ టీఆర్​ఎస్​ లీడర్లు, క్యాడర్​కే ఇస్తారని అనుమానాలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:ప్రతి దళితుడి కుటుంబం ఆర్థికంగా బలపడడానికి దళితబంధు పథకం తెచ్చామని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నెరవేరేలా కనిపించడం లేదు. హుజూరాబాద్ ​ఉప ఎన్నిక సందర్భంగా ప్రకటించిన ఈ స్కీం అర్హులందరికీ అందేలా లేదు. ఇంతకుముందు అన్ని నియోజకవర్గాల్లో 1500 మంది చొప్పున అందజేస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు డబ్బులు లేవంటూ 500 మందికే కుదించింది. దీంతో ఒక్కో నియోజకవర్గంలో వందకు పైగా గ్రామాలుండగా ఊరికి ఒకరిద్దరికి మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. ఇందులోనూ ఎమ్మెల్యేలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత అప్పగించడం, వారు అధికార పార్టీ లీడర్లు, కార్యకర్తలనే  ఎంపిక చేస్తుండడంతో ఆ రెండు, మూడు కూడా అర్హులకు వచ్చే అవకాశాలు లేవని దళితులు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌‌ పార్టీ ఎమ్మెల్యేలున్న చోట తమకు ఆ మాత్రం కూడా రావని టీఆర్‌‌ఎస్‌‌ క్యాడర్​మంత్రులకు అడ్డం తిరుగుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

నియోజకవర్గానికి 500 మందికే

ప్రతి దళిత కుటుంబం నచ్చిన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా దళిత బంధు తెచ్చామని, దీని కోసం రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని సీఎం కేసీఆర్​అప్పట్లో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18లక్షల దళిత కుటుంబాలు ఉండగా, దశల వారీగా 1.80లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మొదటి విడత కింద గతేడాది హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో, మిగిలిన118 నియోజకవర్గాలకు 100 మంది చొప్పున కలిపి 40 వేల మందికి దళితబంధు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు 30 వేల యూనిట్లే గ్రౌండింగ్‌ చేశారు. ఒక్కో మండలానికి 10 నుంచి 15 మందికి మించి ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,500 మందికి దళితబంధు అమలుచేస్తామని చెప్పిన సర్కారు, బడ్జెట్​లో రూ.17,700 కోట్లు కేటాయించింది. కానీ నిధుల లేమి, ఇతర కారణాలతో స్కీంను ప్రస్తుతానికి 500 మందికి కుదించారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఇవ్వాలన్నా దాదాపు రూ. 6 వేల కోట్లు అవసరం.  

అర్హులకు అందేదెప్పుడు?

రాష్ట్రంలో 54.08 లక్షల ఎస్సీ జనాభా ఉంది. హుజూరాబాద్‌‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 18,211, వాసాలమర్రిలో 75, ఖమ్మం జిల్లా చింతకానిలో 3,462, నాగర్‌‌ కర్నూల్‌‌ జిల్లా చారుగొండలో 1,407, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌‌లో 1,298, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 2,223 ఎస్సీ కుటుంబాలకు, దీంతో పాటు ఒక్కో అసెంబ్లీ స్థానంలో 100 యూనిట్ల చొప్పున ఇప్పటి వరకు 38,511 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు స్కీం యూనిట్లు అందజేశారు. ఇదే లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం పూర్తి చేయాలటే చాలా కాలం పడుతుంది. రాష్ట్రంలో సుమారు 20 లక్షల దాకా ఎస్సీ కుటుంబాలుండగా 2022‒23 ఆర్థిక సంవత్సరంలో118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 59 వేల యూనిట్లకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలాగే అమలైతే 2023 మార్చి నాటికి లక్ష కుటుంబాలకు కూడా అందదు. ఈ లెక్కన మిగిలిన 19 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటో సర్కారుకే తెలియాలి.  

అంతా ఎమ్మెల్యేల ఇష్టమే..!

దళిత బంధు స్కీం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ఇష్టమైన వారికే యూనిట్లు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో అన్ని అర్హతలు ఉన్నవాళ్లు ఆందోళనలకు దిగుతున్నారు. ప్రతిరోజూ ఏదోఒక చోట నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తున్నారు. టీఆర్ఎస్​లీడర్లకు, డబ్బున్నోళ్లకే పథకం వర్తింపజేస్తున్నారంటూ కొద్దిరోజుల కింద నిర్మల్​జిల్లాలో దళితులు మంత్రి ఇంద్రకరణ్​​రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆయన లేకపోవడంతో కలెక్టరేట్​ఎదుట ధర్నా చేశారు.  మరోవైపు టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు లేని చోట్ల కూడా తమనే ఎంపిక చేయాలంటూ ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు సాక్షాత్తూ మంత్రులనే అడ్డుకుంటున్నారు. మూడు రోజుల కింద ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన సత్యవతి రాథోడ్​ను అడ్డుకున్న టీఆర్​ఎస్​ క్యాడర్​ఆమె కాళ్లు మొక్కి తమను ఎంపిక చేయాలని
 వేడుకున్నారు. 

జనాభా ప్రాతిపదికన

గతంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కార్పోరేషన్ల పరిధిలో రూ.లక్ష, 2 లక్షల్లోపు స్వయం ఉపాధి యూనిట్లను అందించినప్పుడు జనాభా ప్రాతిపదికన గ్రామాల వారీగా యూనిట్లను కేటాయించి ఎంపీడీఓల ద్వారా దరఖాస్తులు స్వీకరించేవారు. గ్రామ, మండల సభలు ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హులైన వారిని గుర్తించి ఉపాధి కల్పించేవారు. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎమ్మెల్యేలు తమకు  నచ్చిన పేర్లను సెలక్ట్​చేసి ఫైనల్‌‌ చేసి యూనిట్లను అందజేస్తున్నారు. దీంతో నిజమైన పేద, నిరుపేద దళిత కుటుంబాలు అన్యాయానికి గురవుతున్నాయి.