
ఆసిఫాబాద్, వెలుగు:వానలు, వరదలను తట్టుకొని సాగుచేసిన పత్తి అమ్ముకునేందుకు రైతులు దిక్కులు చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. అయినా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించడంలేదు.
దోచుకుంటున్న ప్రైవేట్ వ్యాపారులు
జిల్లాలో 3,15,559 ఎకరాల్లో పత్తి సాగుచేశారు. వర్షాలు.. వరదల కారణంగా దిగుబడి సగం తగ్గింది. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యు), తిర్యాణి, కాగజ్ నగర్ డివిజన్ లోని ఏడు మండలాల్లో దిగుబడి ఎక్కువగా వచ్చింది. సీజన్ ప్రారంభమై 15 రోజులవుతున్నా.. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు. అప్పుచేసి పెట్టిన పెట్టుబడిని తీర్చేందుకు తుట్టికి పావుశేరు అమ్ముకుంటున్నారు. వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేస్తున్నారు. క్వింటల్ పత్తికి గవర్నమెంట్మద్దతు ధర రూ.6,380 ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ. వెయ్యి తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర ఇవ్వాలి...
ఈసారి వర్షాలు.. వరదల కారణంగా పంట దెబ్బతిన్నది. అనుకున్నంత దిగుబడి రాలేదు. వచ్చిన దిగుబడికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. - ఆత్రం నాగు, సిర్పూర్ (యు)
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో 17 జిన్నింగ్మిల్లలు ఉన్నాయి. సీసీఐ కొనుగోలు సెంటర్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు మద్దతు ధర వచ్చేలా చూస్తాం.
- గజానంద్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి