ఎండకు ఎండాల్సిందే.. వానకు తడవాల్సిందే

ఎండకు ఎండాల్సిందే.. వానకు తడవాల్సిందే
  • మెట్రో పార్కింగ్ లో సౌలతుల్లేవ్
  • షెడ్లు లేక ఎండలోనే వెహికల్స్
  • ఫీజు వసూలు చేస్తున్నా ఫెసిలిటీస్ కల్పించట్లే
  • బండ్లు పాడవుతున్నయంటూ ప్యాసింజర్ల  అసహనం

హైదరాబాద్, వెలుగు:
మెట్రో స్టేషన్ల పార్కింగ్​ ఏరియాల్లో సరైన సదుపాయాలు లేక ప్యాసింజర్ల వెహికల్స్ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నయ్. పార్కింగ్​కు జాగా ఉంటున్నప్పటికీ అందులో షెడ్లు లేకపోవడంతో వెహికల్స్​ను ఎండలోనే ఉంచాల్సి వస్తోందని, వానొస్తే బండ్లు తడిసి పాడవుతున్నయని ప్యాసింజర్లు చెబుతున్నారు. పార్కింగ్ ఫీజు చెల్లిస్తున్నా మెట్రో యాజమాన్యం మాత్రం సరైన సౌలతులు కల్పించట్లేదని మండిపడుతున్నారు.

కలర్ షేడ్..

మెట్రో స్టేషన్ల వద్ద ఎక్కడా పార్కింగ్ ​షెడ్లు కనిపించడం లేదు. దీంతో మెట్రో ప్యాసింజర్ల వెహికల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉంటున్నాయి. బండ్లు కలర్ షేడ్ అవుతున్నాయని, పెట్రోల్ సైతం ఆవిరైపోతోందని ప్యాసింజర్లు వాపోతున్నారు. వానాకాలంలో వర్షానికి తడిసి కొన్ని స్పేర్ పార్ట్స్ తుప్పుపట్టి పాడైపోతున్నాయని చెబుతున్నారు. మెట్రో యాజమాన్యం పార్కింగ్​పై  స్పెషల్ ఫోకస్ పెట్టి ఫెసిలిటీస్ కల్పించాలని ప్యాసింజర్లు కోరుతున్నారు.

ప్యాసింజర్లపై ఆర్థిక భారం

మెట్రోలో రోజుకు 4 లక్షల మందికి పైగానే జర్నీ చేస్తున్నారు. దీంతో పార్కింగ్‌‌ చేసే వెహికల్స్ సంఖ్య రెట్టింపవుతోంది. అయితే,  మెట్రో యాజమాన్యం మాత్రం ఆదాయంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. బైక్​లకు అరగంట నుంచి గంట వరకు రూ.10, గంట నుంచి 3 గంటల వరకు రూ.15, నాలుగు గంటల వరకు రూ.20, నాలుగు గంటలకు పైగా నిలిపితే రూ.25 వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు ఫోర్ వీలర్లకు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. అరగంట నుంచి గంట వరకు  రూ.30, మూడు గంటల వరకు రూ.45, నాలుగు గంటల పాటు ఫోర్ వీలర్​ను పార్క్ చేస్తే రూ.60, అంతకు మించి సమయానికి రూ.75 వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లేవారికి మెట్రో ప్రయాణ చార్జీలతో పాటు ఈ పార్కింగ్ ఫీజులు మరింత భారంగా మారాయి. అంతటా ఫ్రీ పార్కింగ్ కల్పించాలని జీహెచ్ఎంసీ చెబుతుంటే మెట్రోస్టేషన్ల వద్ద మాత్రం అందుకు విరుద్ధంగా ఫీజు వసూలు చేస్తున్నారని ప్యాసింజర్లు చెబుతున్నారు. 

షెడ్లు ఏర్పాటు చేయాలి

డైలీ మెట్రోలో ఎల్​బీనగర్ నుంచి మాదాపూర్​కు అప్ అండ్ డౌన్ చేస్త. దీంతో బైక్ ను ఎల్​బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ఎండకే పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.25 పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ కనీసం షెడ్లు ఏర్పాటు చేయడం లేదు. డైలీ ఎండలో ఉండటం వల్ల బైక్​ కలర్ షేడ్ అవుతోంది. 

- లెనిన్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, ఎల్​బీనగర్