మున్నేరు తీరంలో ఇండ్లకు నో పరిమిషన్​

మున్నేరు తీరంలో ఇండ్లకు నో పరిమిషన్​
  •     మున్నేరు ముంపు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తాం
  •     మీడియా సమావేశంలో కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఇకనుంచి ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని కలెక్టర్ వీపీ వెల్లడించారు. సోమవారం నగరంలోని టీటీడీసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. నగరంలోని ముంపు ప్రాంతాలైన బొక్కల గడ్డ, మోతీ నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, జూబ్లీపురా, ప్రకాశ్​నగర్, దానవాయి గూడెం, ఖమ్మం రూరల్ మండలంలో కేబీఆర్ నగర్, జలగం నగర్ లలోని ఇరు వైపులా ముంపు వరద ఎంత వరకు ఉందో గుర్తించి హద్దు రాళ్లను వేస్తామన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు పరిమిషన్​ ఇవ్వబోమన్నారు. గత ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 1723, ఖమ్మం రూరల్ మండలంలో 502 ఫ్యామిలీలు వరద ముంపునకు గురైనట్లు లెక్క తేలినట్లు చెప్పారు. ఖమ్మంలో 25, రూరల్ మండలంలో ఇండ్ల ప్రహరీలు, ఇండ్లు, షెడ్లు వంటివి కూలిపోయినట్లు తెలిపారు. ఖమ్మం టౌన్ పరిధిలో 640, రూరల్ మండలంలో 288 మంది కుటుంబాలకు చెందిన వారి సామాన్లు వరదలో కొట్టుకుపోయినట్లు కలెక్టర్ వివరించారు.

వరద బాధితులకు తక్షణ సాయంగా ప్రభుత్వం నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. రెండు రోజులుగా హెల్త్ సర్వే చేయగా 34 మందికి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మందులు పంపిణీ చేశామని చెప్పారు. మున్నేరు నదికి ఇప్పుడు వచ్చిన వరద ఉధృతి మునుపెన్నడూ రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇండ్లు కోల్పోయి, తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు వేరే ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉండడానికి ఇష్టపడనివారు తమ దృష్టికి తెస్తే వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.  సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఎంహెచ్ వో డాక్టర్ బి.మాలతి తదితరులు పాల్గొన్నారు.

మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్​వాల్​

ఖమ్మం కార్పొరేషన్ : మున్నేరు నదికి ఇరువైపుల రిటైనింగ్​వాల్​నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. వరదకు శాశ్వత పరిష్కారం మున్నేరుకు ఆర్ సీసీ కాంక్రిట్​ వాల్​నిర్మాణమేనని, కరకట్ట ద్వారా చాలామంది ఇండ్లు కోల్పొవాల్సి వస్తుందని సీఎం కేసీఆర్​కు వివరించినట్లు తెలిపారు. మున్నేరు బాధితుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు.