రైఫిల్స్ ఉన్నాయి గానీ బుల్లెట్లు లేవు!

రైఫిల్స్ ఉన్నాయి గానీ బుల్లెట్లు లేవు!

కొత్త స్నైపర్ రైఫిల్స్ రాక కోసం ఇండియన్ ఆర్మీ మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పేలా లేదు. గతేడాది 982 కోట్ల రూపాయల విలువజేసే 5700 స్నైపర్ రైఫిల్స్ కోసం ఆర్మీ కొనుగోళ్ల ప్రక్రియను మొదలుపెట్టింది. దీనికి 20 కంపెనీలు ఆఫర్లిచ్చాయి. అయితే, తమ వద్ద స్నైపర్ రైఫిల్స్ ఉన్నాయి గానీ బుల్లెట్లు లేవని  చెప్పాయి. దీంతో ప్రొక్యూర్ మెంట్ మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి ఈ డీల్ ద్వారా ఆర్మీ ట్రాన్స్‌‌ఫర్ ఆఫ్ టెక్నాలజీని కూడా తీసుకోవాలని భావిస్తోంది. దీని వల్ల ఎక్కువకాలం పాటు స్నైపర్ రైఫిల్స్‌‌ను వాడుకోవచ్చు. కాలానుగుణంగా వాటికి మార్పులు, చేర్పులు చేయొచ్చు. కానీ బుల్లెట్లు తయారు చేసే టెక్నాలజీ అందుబాటులో లేదని కంపెనీలు చెప్పాయి. దీంతో ఈ డీల్‌‌ను రద్దు చేసి, కొత్త డీల్‌‌కు వెళ్లాలని ఆర్మీ భావిస్తున్నట్లు తెలిసింది. రైఫిల్స్, బుల్లెట్ల కోసం వేర్వేరుగా రెండు ప్రొక్యూర్ మెంట్ ప్రాసెస్‌‌లను ఆర్మీ తెరవొచ్చని సమాచారం.

లేకపోతే రైఫిల్స్ సరఫరా చేసే కంపెనీయే కచ్చితంగా బుల్లెట్లు సప్లై చేయాలనే నిబంధన పెట్టొచ్చని తెలిసింది. ఆ తర్వాత ఇండియాలోనే బుల్లెట్లను తయారు చేయాలనేది మరో రూల్‌‌.  ఆర్మీ గతేడాది తెరచిన బిడ్‌‌కు ఫిన్‌‌లాండ్‌‌కు చెందిన సాకో, అమెరికాకు చెందిన హెచ్ఎస్ ప్రెసిషన్, బ్రిటన్‌‌కు చెందిన స్టీల్ కోర్ డిజైన్స్ లిమిటెడ్, ఫ్రాన్స్‌‌కు చెందిన పీజీఎం ప్రెసిషన్, ఇజ్రాయెలీ వెపన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలు ముందుకొచ్చాయి. సరిహద్దుల్లో స్నైపర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆర్మీ పెద్ద ఎత్తున స్నైపర్ రైఫిల్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే ఉత్తర ఆర్మీ కమాండర్ తనకు ఉన్న అధికారాలతో ఎమర్జెన్సీగా కొన్ని స్నైపర్ రైఫిల్స్ ను కొనుగోలు చేశారు. కొత్తగా కొనబోయే 5700 స్నైపర్ రైఫిల్స్ ను అన్ని సరిహద్దుల్లోని బలగాలకు అందిస్తారు.