రెండు తడకలు.. రెండు చీరలు..ఇదే బాలికల టాయిలెట్

రెండు తడకలు.. రెండు చీరలు..ఇదే బాలికల టాయిలెట్
  • కాటారం ఐటీఐ కాలేజీలో దయనీయ పరిస్థితి
  • సర్కారు బడుల్లో పరిస్థితి మరీ అధ్వానం
  • 5వేల స్కూళ్లలో గర్ల్స్​కు సెపరేట్​టాయిలెట్స్​ లేవ్​
  • 10వేల స్కూళ్లలో ఉన్నా ఉపయోగించలేని పరిస్థితి
  • ఆరుబయటే బాయ్స్​ కాలకృత్యాలు

వెలుగు, నెట్​వర్క్​:  సర్కారు బడుల్లో టాయిలెట్స్ సరిగ్గా లేక పిల్లలు ఒంటికి, రెంటికి తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. చాలా చోట్ల అబ్బాయిలు ఆరుబయట పనికానిస్తున్నా,  అమ్మాయిల పరిస్థితి ఘోరంగా ఉన్నది.  చాలాచోట్ల టాయిలెట్లు శిథిలావస్థకు చేరి, డోర్లు ఊడిపోయి, మెయింటనెన్స్​ లేక అధ్వానంగా తయారయ్యాయి.  ఇంకొన్ని చోట్ల అసలు టాయిలెట్లే  లేకపోవడంతో కర్రల చుట్టూ చీరలు కట్టుకొని కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి ఉన్నది.

కేశవనగర్​లోనే కాదు.. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి.. 

హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేశవ్​నగర్​ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని చూసి తన కళ్ల లోంచి నీళ్లు వచ్చాయని, స్కూల్​లో చదువుతున్న ఆడ పిల్లలకు సరైన టాయిలెట్స్​ కూడా లేవని ఈ నెల 12న సీఎం కేసీఆర్​ మనవడు హిమాన్షురావు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  కానీ ఈ పరిస్థితి ఒక్క కేశవ్​నగర్​ స్కూల్​దే కాదు, రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేని పాఠశాలలు సుమారు 5వేలకు పైగా ఉన్నాయి. యూడైస్​2022 రిపోర్ట్​ ప్రకారం దేశవ్యాప్తంగా 96.5 శాతం సర్కారు బడుల్లో బాలికలకు సెపరేట్​ టాయిలెట్స్​ ఉండగా,  తెలంగాణ లో కేవలం78.8 శాతం స్కూళ్లలో మాత్రమే ఆడపిల్లలకు టాయిలెట్స్​అందుబాటులో ఉన్నాయి.  వినియోగంలో ఉన్నవాటిని లెక్కలోకి తీసుకుంటే సుమారు 10వేల పాఠశాలల్లో స్టూడెంట్లు ఒంటికీ,  రెంటికీ బయటకు పోవాల్సి వస్తోందని రిపోర్టులు చెప్తున్నాయి. పొరుగున ఉన్న  ఏపీలో జాతీయ సగటు కంటే ఎక్కువగా (96.6 శాతం) టాయిలెట్స్​అందుబాటులో ఉండడం విశేషం. 

5శాతం స్కూళ్లలోనే మౌలిక వసతులు.. 

రాష్ట్రవ్యాప్తంగా 26,065 సర్కారు  బడులు ఉండగా,  ‘మన ఊరు.. మనబడి’ స్కీం కింద  రూ.7,290 కోట్లతో మూడు విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని  ప్రభుత్వం నిరుడు ప్రకటించింది. మొదటి విడత  రూ.3,497 కోట్లతో  9,123 బడులను డెవలప్ చేస్తామని2022 ఫిబ్రవరిలో జీవో ఇచ్చింది. ఎంపిక చేసిన సర్కారు బడుల్లో పాత బిల్డింగులకు రిపేర్లతోపాటు అదనపు గదులు, టాయిలెట్స్, కిచెన్ షెడ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణం, లైటింగ్, ఫర్నిచర్, డిజిటల్ క్లాసులు, గ్రీనరీ, తాగునీరు లాంటి 12 రకాల ఫెసిలిటీస్​ కల్పించాల్సి ఉంది. కానీ ఏడాది కాలంలో 10 శాతం ఫండ్స్ కూడా కేటాయించకపోవడంతో కేవలం మండలానికి రెండు స్కూళ్ల చొప్పున 1200 (4.6శాతం) బడుల్లో  మాత్రమే మౌలిక వసతులు కల్పించారు. మిగిలిన 95శాతం లోపు స్కూళ్లలో స్టూడెంట్లు ఒంటికి,  రెంటికి తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. గతంలో స్కూళ్లలో స్కావెంజర్లు ఉన్నప్పుడు టాయిలెట్స్​ కనీసం వాడుకునే స్థితిలో ఉండేవి.  కానీ జీతాలివ్వలేక  28వేల మంది స్కావెంజర్లను ప్రభుత్వం తొలగించినప్పటి నుంచి నిర్వహణ సరిగ్గా లేక ఉన్న కొద్దిపాటి  టాయిలెట్లు కూడా మూలపడ్డాయి. ఇక ఈ ఏడాదిలాగే  ‘మన ఊరు మన బడి’ పనులు కొనసాగితే అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చేసరికి 20 ఏండ్లు పడ్తుందని,  అందువల్ల స్కూల్​ బిల్డింగులతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఉన్న టాయిలెట్లకు రిపేర్లతో పాటు కొత్త టాయిలెట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది. 

భూపాలపల్లి జిల్లా కాటారంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చదివే విద్యార్థినులు ఉపయోగిస్తున్న టాయిలెట్​ ఇది.  ఇందులో 79 మంది స్టూడెంట్లు చదువుతుండగా,  వీరిలో ఐదుగురు గర్ల్స్.  2008లో  ఏర్పడ్డ ఈ కాలేజీకి నేటికీ టాయిలెట్స్‌‌‌‌‌‌‌‌ లేవు. నాలుగేండ్ల  కింద టాయిలెట్స్​నిర్మాణం ప్రారంభించినా ఫండ్స్​ లేక మధ్యలో వదిలేశారు.  దీంతో బాయ్స్‌‌‌‌‌‌‌‌ ఆరు బయటే  పనికానిస్తుండగా, బాలికలు ఇదిగో ఇలా చీరెలతో కట్టిన పరదాల చాటున కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. టాయిలెట్​ లేదని తెలిసి తమ తల్లిదండ్రులు కాలేజీ బంద్​చేయమంటున్నారని ఓ స్టూడెంట్​ వాపోయింది.

 ఆరుబయటే మూత్ర విసర్జన

భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం 2 కి.మీ దూరంలో ఉన్న జంగేడు ప్రభుత్వ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు ఆరుబయట మూత్ర విసర్జన చేస్తున్నారు. బాలికలు, బాలురు కలిపి ఇక్కడ 313 మంది చదువుకుంటున్నారు. బాలికల కోసం బాత్రూమ్‌‌‌‌‌‌‌‌లు కట్టినా పై కప్పు వేయలేదు. దీంతో విద్యార్థినులు సైతం మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపోతే బాయ్స్‌‌‌‌‌‌‌‌కి  అసలు బాత్రూమ్‌‌‌‌‌‌‌‌లే లేవు. దీంతో ఇంటర్వెల్‌‌‌‌‌‌‌‌ అయ్యిందంటే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి స్కూల్‌‌‌‌‌‌‌‌ ప్రాంగణంలోనే ఆరుబయట మూత్ర విసర్జన చేస్తున్నారు.