ప్రాణహిత పుష్కరాలకు నిధులియ్యని సర్కారు

ప్రాణహిత పుష్కరాలకు నిధులియ్యని సర్కారు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: పన్నెండేళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలకు ఇంకా 10 రోజులే గడువుంది. ఏప్రిల్‌‌ 13 నుంచి పుష్కరాలు మొదలు కానున్నాయి. అయినా పుష్కరాల నిర్వహణకు అవసరమైన ఫండ్స్​ నేటికీ రాష్ట్ర సర్కారు విడుదల చేయలేదు. పుష్కరాలకు ఎప్పట్లాగే తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌ గఢ్‌‌ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.  త్రివేణి సంగమంగా  ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరంలో పుణ్యస్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంలో ప్రైవేట్‌‌ రూములన్నీ బుక్‌‌ అయిపోయాయి. కానీ ఇప్పటివరకు రాష్ట్ర సర్కారులో ఎలాంటి కదలిక లేదు.  ఖజానా నుంచి  రూపాయి కేటాయించలేదు. దీంతో ఆఫీసర్లు ప్రాణహిత నది వెంబడి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. 

ఉమ్మడి ఏపీలో స్టేట్​ ఫెస్టివల్​గా..

ఉమ్మడి ఏపీలో 2010 డిసెంబర్​లో ప్రాణహిత పుష్కరాలు వచ్చాయి.  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఈ పుష్కరాలను స్టేట్‌‌ ఫెస్టివల్‌‌గా ప్రకటించి ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం వద్ద ఎండోమెంట్‌, ఇతర శాఖల తరపున మొత్తం రూ.9.72 కోట్ల వరకు  ఖర్చు చేశారు. సీఎం హోదాలో కిరణ్​కుమార్​రెడ్డి  స్వయంగా పాల్గొన్నారు. అప్పట్లో  రోజుకు 70 వేల నుంచి లక్ష మంది చొప్పున12 రోజుల్లో సుమారు 15 లక్షల మంది వరకు కాళేశ్వరం వచ్చి పుష్కర స్నానాలు చేశారు. ఈసారి కాళేశ్వరానికి రోజుకు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌‌ జిల్లాల్లోనూ భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశముంది. ఈ మేరకు ఏర్పాట్ల కోసం రూ.35 కోట్లతో ప్రభుత్వానికి ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రపోజల్స్​ పంపించారు. కానీ 10 రోజులే గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌‌ రెడ్డి కేవలం ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్‌‌లు పెట్టడానికే పరిమితం అయ్యారు. సీఎం హోదాలో కేసీఆర్‌‌ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆయా జిల్లాల్లోని లోకల్‌‌ ఫండ్స్‌ ‌తోటే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా క్లారిటీ లేదు. ప్రస్తుతం కాళేశ్వరం టెంపుల్‌‌ ఫండ్స్‌‌ తో భక్తులు సేద తీరడానికి ఆలయ పరిసరాల్లో చలువ పందిర్లు వేస్తున్నారు.

నది పొడవునా నీళ్లే.. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఏడాది కాలంగా ప్రభుత్వం మూసి ఉంచింది. ఈ బ్యారేజీలో ప్రస్తుతం 13 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో ప్రాణహిత నది పొడవునా మంచిర్యాల జిల్లా వరకు నీరే కనిపిస్తోంది. పుష్కరాల సమయంలో నదిలో నీటి ప్రవాహం పాయల్లాగా ఉండాలి. అలా ఉంటేనే భక్తులు పుష్కర స్నానాలు చేయడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నీళ్లు నిల్వ ఉంటే లోతు తెలియక భక్తులు మునిగిపోయే ప్రమాదం ఉందని ఎండోమెంట్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేస్తే ఫ్రెష్‌‌ వాటర్‌‌ వస్తాయి. కాళేశ్వరంలో ఇసుక తెప్పలు బయటపడతాయి. అప్పుడు ఇసుకలో చలువ పందిళ్లు వేయడానికి వీలవుతుందని, భక్తులు దుస్తులు మార్చుకునే గదులను కూడా ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.

త్వరలోనే నిధులు వస్తాయి

ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు సర్కారు నుంచి త్వరలోనే నిధులు వస్తాయి. కాళేశ్వరం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచే విషయంపై ఇప్పటికే ఇరిగేషన్‌‌ ఆఫీసర్లతో చర్చించాం.
‒ భవేశ్‌‌ మిశ్రా, జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌