2 రోజులు ఎండలు..4 రోజులు వానలు

2 రోజులు ఎండలు..4 రోజులు వానలు
  • రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు
  • ఉత్తర తెలంగాణలో వానలు.. దక్షిణ తెలంగాణలో ఎండలు: వాతావరణ శాఖ
  • -రెండు రోజులపాటు13 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ 
  • 26  జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు నమోదు
  • మిగతా 7 జిల్లాల్లోనూ 42 నుంచి 42.9 మధ్య రికార్డ్​

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల ప్రభావం ఉండనుండగా.. ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఉత్తరాది జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో దక్షిణ తెలంగాణలో మాత్రం ఎండలు దంచికొట్టనున్నాయి. వానల తర్వాత మళ్లీ ఎండలు తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

శని, ఆదివారాల్లో వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం నుంచి మూడు, నాలుగు రోజులపాటు ఉత్తరాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చంది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్​, కామారెడ్డి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పింది.  గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. 

దంచికొట్టిన ఎండలు

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఎండలు దంచికొట్టాయి. 7 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 43 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. ఆ 7 జిల్లాల్లోనూ 42 నుంచి 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. నాలుగు జిల్లాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్లు నమోదుకాగా.. నల్గొండ జిల్లా గూడాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేట, సూర్యాపేట జిల్లా మట్టపల్లి, జగిత్యాల జిల్లా కోల్వాయిల్లో 43.5 డిగ్రీల మేర రికార్డయ్యాయి. ఎల్​నినో ప్రభావంతోనే టెంపరేచర్లు పెరుగుతున్నాయని ఐఎండీ చెప్పింది. 

హీట్​వేవ్స్​తో జాగ్రత్త

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండపూట బయటకు వెళ్లొద్దని డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ రవీందర్​ నాయక్​ సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, సెలైన్లు, మెడిసిన్ అందుబాటులో ఉంచామన్నారు.

డీహైడ్రేషన్​ జరగకుండా చూసుకోవాలి

పిల్లలు, గర్భిణులు, వృద్ధులపై హీట్​వేవ్స్​ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో డీ హైడ్రేషన్​ వల్ల హైబీపీ వచ్చే ప్రమాదముంది. నెలలు నిండకముందే ప్రసవం జరగడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టే ముప్పు ఉంటుంది. హార్ట్​ఎటాక్స్​, కిడ్నీలో రాళ్లు ఏర్పడొచ్చు. నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరాన్ని వీలైనంత చల్లగా ఉంచుకోవాలి. డీహైడ్రేషన్​కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండదెబ్బ నుంచి రక్షణకు ఓఆర్ఎస్​ వంటి వాటిని దగ్గర పెట్టుకోవాలి.

డాక్టర్​ కీర్తన యాదవ్​,అసిస్టెంట్​ ప్రొఫెసర్​, ఉస్మానియా హాస్పిటల్​