కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేదెప్పుడు.?

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేదెప్పుడు.?

వరంగల్‍ రూరల్‍, వెలుగు: కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న సీఎం కేసీఆర్‍ హామీ ఎనిమిది నెలలు గడిచినా అమలు కాకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. తానే స్వయంగా టాప్‍ లెవల్‍ మీటింగ్‍ పెట్టి  అవసరమైన చర్యలు తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కరోనా సెకండ్‍ వేవ్‍తో నెల నుంచి వేలాది మంది పిట్టల్లా రాలుతుంటే కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‍ చేస్తున్నారు. ఇదే విషయమై వరంగల్​వేదికగా మొదలైన ఉద్యమం క్రమంగా స్టేట్​అంతా విస్తరిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకు పలువురు తమ ఇండ్లలో దీక్షలకు దిగుతుండగా.. వందలాది పబ్లిక్‍ సోషల్‍ మీడియా వేదికగా మద్దతు పలుకుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సెల్ఫీ వీడియోల ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పేద, మిడిల్‍ క్లాస్‍ మరణాలే ఎక్కువ..

కరోనా ఫస్ట్​వేవ్​లో కొవిడ్‍ కేసులున్నా.. మరణాలు పెద్దగా లేవు. కానీ ఫస్ట్​ వేవ్​తో పోలిస్తే సెకండ్‍ వేవ్‍ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూసినా ఈ నెల 13 వరకు ఏకంగా 2,896  మంది మృతిచెందారు. అందులోనూ గవర్నమెంట్​హాస్పిటల్స్​లో మరణాల రేటు ఎక్కువగా ఉండడంతో కండీషన్​ సీరియస్​ అయినప్పుడు అప్పొసొప్పో చేసి ప్రైవేట్​హాస్పిటల్స్​లో చేరుతున్నారు. ఇదే అదనుగా జిల్లాల్లోని చిన్నచితక హాస్పిటల్స్​మొదలుకొని హైదరాబాద్​లోని కార్పొరేట్​హాస్పిటల్స్​దాకా లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను ఏ ఒక్క ప్రైవేట్​ఆసుపత్రి అమలు చేయడం లేదు.  మధ్యతరగతి ప్రజలు సైతం మూడు రోజులు గడిచాక.. ప్రైవేట్‍ లో దోపిడీని తట్టుకోలేక బయటకు వస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో బెడ్లు, ఆక్సిజన్‍, వెంటిలేటర్ల కోసం లీడర్లు, డాక్టర్ల కాళ్లావేళ్ల పడుతున్నారు. గవర్నమెంట్‍ ఆసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్​ తక్కువ ఉండడం, కావాల్సిన సౌకర్యాలు లేకపోవడంతో మరణాల రేటు పెరుగుతోంది. ఓ విధంగా పేద, మిడిల్‍ క్లాస్‍ నుంచే మృతులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్‍ తెరపైకి వచ్చింది. 

వరంగల్​లో మొదలైన దీక్షలు, నిరసనలు

కొవిడ్‍ ట్రీట్‍మెంట్‍ను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ  సీఎం కేసీఆర్‍ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని వరంగల్​లో దీక్షలు, నిరసనలు మొదలయ్యాయి. మొదట వరంగల్‍ అర్బన్‍ జిల్లా హసన్‍పర్తి జేఏసీ ఆధ్వర్యంలో షురూ అయిన డిమాండ్‍ ఆ తర్వాత ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ డిమాండ్‍కు జనాలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఎవరికివారుగా ఇదే అంశంపై వీడియోలు, ఫోటోలు షూట్‍ చేసి సోషల్‍ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. వీరికి వేల మంది సపోర్ట్​ చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం లేటయినకొద్దీ వేలాది పేదలు, మిడిల్​క్లాస్​ తమ విలువైన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందని కన్నీరు పెడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఇచ్చిన హామీ అమలులో ఇంత ఆలస్యమెందుకని ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాధిని త్వరితగతిన ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేదలు, బడుగు బలహీనవర్గాల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని మరికొందరు హెచ్చరిస్తున్నారు.  ‘పేద కుటుంబాల జీవించే హక్కును కాపాడండి..’ అంటూ చేతులెత్తి దండం పెడుతున్నారు. వీ వాంట్‍ జస్టిస్‍.. వీ వాంట్‍ జస్టిస్‍ అంటూ నిరసన తెలుపుతున్నారు. 

జీవించే హక్కును కాపాడాలె 

కరోనా సెకండ్‍ వేవ్‍ కారణంగా పేదలు, బడుగు బలహీనవర్గాలవారే ఎక్కువ మంది చనిపోతున్నారు.  దాదాపు 90 శాతం మంది బాధితులు వీళ్లే. కొవిడ్‍ దెబ్బతో ఇప్పటికే లక్షల మంది ఉపాధిలేక ఆగమయ్యారు. ఈ టైంలో కరోనా బారినపడి హాస్పిటల్‍ బిల్లులు కట్టలేక స్వచ్ఛంద మరణం కోరుతున్నారు. కష్టకాలంలో కొత్త అప్పులు పుట్టక దేవుని మీద భారం వేస్తున్నారు. సీఎం కేసీఆర్‍ కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని  అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సీఎంకు దండం పెట్టి చెప్తున్నం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును కాపాడాలి.
- అనుమాండ్ల విద్యాసాగర్‍, హసన్‍పర్తి జేఏసీ, వరంగల్‍ 

‘ప్రతిపక్ష లీడర్లు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలన్నరు.. తప్పకుండా ఆ విషయాన్ని టాప్‍ లెవల్‍ మీటింగ్‍ పిలిచి నేనే పరిశీలిస్తా.. అది మంచి సలహానే.. పేదలను ఆదుకోవడంలో ఎప్పుడూ మేం ముందు ఉంటం అధ్యక్షా.. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదు.’’  
- నవంబర్​2, 2020న అసెంబ్లీలో కేసీఆర్‍

‘ ప్రైవేట్​లో కరోనా ట్రీట్​మెంట్​కు ఇష్టమొచ్చినట్టు పైసలు వసూలు చేస్తున్నరు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతున్న ప్రైవేట్ హాస్పిటళ్ల​పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. ప్రజలంతా కొవిడ్-19ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నరు.. ఎప్పుడు చేరుస్తారో చెప్పండి.’
- గురువారం ‘ఆస్క్ కేటీఆర్’ లో మంత్రికి నెటిజన్ల ప్రశ్న 

వరంగల్‍ రూరల్‍ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‍ సోకి, శ్వాస కష్టం కావడంతో ఆమె కుటుంబీకులు సిటీలోని ఓ ప్రైవేట్‍ హాస్పిటల్‍లో అడ్మిట్‍ చేశారు. రెండు రోజులకే రూ.2.80 లక్షల బిల్‍ అయింది తప్పితే ఆమె కోలుకోలేదు. ఖర్చు ఎక్కువ అవుతుండటంతో చేసేది లేక వరంగల్‍ ఎంజీఎం తరలించారు. రెండు రోజుల ట్రీట్​మెంట్​అనంతరం ఆమె చనిపోయింది. భర్తకూ మైల్డ్ సిమ్టమ్స్ కనిపించాయి. అప్పటికే భార్య చనిపోవడంతో భర్తను సిటీలోని ప్రైవేట్‍ హస్పిటల్‍ లో జాయిన్​ చేశారు.  మూడు రోజుల నార్మల్‍  ట్రీట్‍మెంట్‍కే రూ.1.47 లక్షల బిల్లు వేశారు. ఇలా వారంలో కరోనా  కారణంగా ఆ ఫ్యామిలీ రూ.4.27 లక్షల అప్పు చేసింది. అయినా ఓ ప్రాణం పోయింది. కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే తాము అప్పులపాలు కాకపోయే వాళ్లమని ఆ కుటుంబం అంటోంది.