మెదక్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లా : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ పెద్దతండాలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల వాళ్లు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. మాజీ ఎంపీటీసీ మంగ్యా నాయక్, కేతావత్ కాలనీ వాసులకు మధ్య రాళ్ల దాడి జరిగింది. హనుమాన్ గడ్డ భూమిని నేనవత్ మంగ్యా నాయక్ అనే వ్యక్తి  కబ్జా చేసి, సేవాలాల్ భవాని మాత జెండాను తొలగించాడంటూ తండా వాసులు ఆందోళనకు దిగారు. 

ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని గత మూడు సంవత్సరాల క్రితం మాజీ ఎంపీటీసీ మంగ్యా నాయక్.. తమకు తెలియకుండా పట్టా చేసుకున్నారని ఆరోపిస్తూ.. కేతావత్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్న భూమిలో కేతావత్ కాలనీ వాసులు టెంట్ వేసుకుని శాంతియుతంగా ధర్నాకు దిగారు. ఈ సమయంలో మంగ్యా నాయక్ అక్కడకు వచ్చి టెంట్ ను తొలగించడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. 

ఐదు ఎకరాల స్థలంలో గత కొన్నేళ్లుగా తాము వన భోజనాలకు వెళ్తున్నామని కేతావత్ కాలనీ వాసులు చెబుతున్నారు. 2020 సంవత్సరంలో ఐదు ఎకరాల భూమిని మంగ్యా నాయక్ కబ్జా చేశాడని స్థానిక ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. ప్రభుత్వ భూమిని మంగ్యా నాయక్ దౌర్జన్యంగా పట్టా చేసుకుని.. తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. ఇరు వర్గాలకు నచ్చజెప్పారు.