ఇంకో ఐదేళ్లలో దేశంలోకి రూ.39 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఇంకో ఐదేళ్లలో దేశంలోకి రూ.39 లక్షల కోట్ల పెట్టుబడులు!
  • దేశంలో ఇన్వెస్ట్‌‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఎంఎన్‌‌సీలు
  • వెల్లడించిన ఈవై–సీఐఐ రిపోర్ట్‌‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు,  వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్‌‌సీల) ను ఆకర్షిస్తోందని సర్వే ఒకటి వెల్లడించింది. ఇంకో ఐదేళ్లలో  దేశంలోకి  475 బిలియన్ డాలర్ల (రూ.39 లక్షల కోట్ల)  విలువైన ఫారిన్‌‌  డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌మెంట్లు (ఎఫ్‌‌డీఐలు) వచ్చే అవకాశం ఉందని తెలిపింది. వివిధ మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్‌‌సీల) అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే రిపోర్ట్‌‌ను ఈవై, సీఐఐలు  విడుదల చేశాయి. గ్లోబల్‌‌గా తమ బిజినెస్‌‌లను విస్తరించడంలో భాగంగా  దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు 71 శాతం ఎంఎన్‌‌సీలు ఆసక్తిగా ఉన్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఇండియా పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తుందని అంచనావేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, దీర్ఘ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌‌గా ఉంటుందని 96 శాతం ఎంఎన్‌‌సీలు పేర్కొన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌‌టీ వంటి పాలసీలను, డిజిటల్‌‌ ఎకానమీకి ఇస్తున్న సపోర్ట్‌‌ను,  ట్యాక్స్ సిస్టమ్‌‌లో పెరిగిన పారదర్శకతను ఈ సందర్భంగా కంపెనీలు మెచ్చుకున్నాయని ఈవై–సీఐఐ రిపోర్ట్ పేర్కొంది. షార్ట్‌‌ టెర్మ్‌‌లో కూడా దేశ ఎకానమీ మెరుగవుతుందని మెజార్టీ ఎంఎన్‌‌సీలు ఒప్పుకున్నాయి.  దేశ ఎకానమీ ఇంకో 3 నుంచి ఐదేళ్లలో మరింతగా వృద్ధి చెందుతుందని  పేర్కొన్నాయి. గత పదేళ్ల నుంచి దేశంలోకి వచ్చే ఎఫ్‌‌డీఐలు నిలకడగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ  2021–22 లో దేశంలోకి ఏకంగా 84.8 బిలియన్ డాలర్ల (రూ.7 లక్షల కోట్ల) పెట్టుబడులు వచ్చాయి. ‘గ్లోబల్‌‌  సప్లయ్‌‌ చెయిన్‌‌లో  మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌గా ఇండియా ఎదుగుతోంది. దేశ కన్జూమర్ మార్కెట్‌‌ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో డిజిటైజేషన్ విస్తరిస్తోంది’ అని ఈవై ఇండియా పార్టనర్‌‌‌‌ సుధీర్‌‌‌‌ కపాడియా పేర్కొన్నారు.  ప్రభుత్వం దేశంలో వ్యాపారం చేసుకోవడం మరింత ఈజీగా మార్చాలని, ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్‌‌లను త్వరగా పూర్తి చేయాలని, వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌‌లను తొందరగా  కంప్లీట్ చేయాలని, జీఎస్‌‌టీలో సంస్కరణలు తీసుకురావాలని ఎంఎన్‌‌సీలు కోరుతున్నాయి. ప్రభుత్వం పవర్ సెక్టార్‌‌‌‌లో తెచ్చిన సంస్కరణలను,  హెల్త్‌‌, ఎడ్యుకేషన్ సెక్టార్లలో ‘దేశ్’ ఇనీషియేటివ్‌‌ ద్వారా  పోటీతత్వాన్ని పెంచడం వంటి అంశాలను ఎంఎన్‌‌సీలు మెచ్చుకున్నాయి. 

పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చు
దేశ ఎకానమీ గ్లోబల్‌గా ఐదో అతిపెద్ద ఎకానమీగా మారిందని  ఈ రిపోర్ట్ గుర్తు చేసింది.  వేగంగా వృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ   2025 నాటికే  జర్మనీని దాటి నాలుగో ప్లేస్‌‌కు, 2027 నాటికి జపాన్‌‌ను దాటి మూడో ప్లేస్‌‌కు చేరుకుంటుందని అభిప్రాయపడింది. అప్పటికీ టాప్ పొజిషన్‌‌లో యూఎస్‌‌, చైనాలు ఉంటాయని తెలిపింది.  ఈ సర్వే ప్రకారం, వ్యాపారం  చేసుకోవడం గ్రౌండ్‌‌ లెవెల్‌‌లో మెరుగయ్యిందని 64 శాతం ఎంఎన్‌‌సీలు తెలిపాయి. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌‌ల కోసం వచ్చే  ఐదేళ్లలో 1.3 ట్రిలియన్ డాలర్ల (రూ. 103 లక్షల కోట్ల) ను ప్రభుత్వం ఖర్చు చేయాలని చూడడం, ప్రభుత్వం చేసే ఖర్చులు జీడీపీలో పెరగడం, నేషనల్ మానిటైజేషన్ పైప్‌‌లైన్ (ఎన్‌‌ఎంపీ) ద్వారా రూ. 6 లక్షల కోట్లను సేకరించాలని చూస్తుండడం,  గతి శక్తి వంటి  స్కీమ్‌‌లు దేశంలోకి  ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లు భారీగా రావడానికి సాయపడతాయని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది.

ఇంకో 5 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..
దేశ ఆర్థిక వ్యవస్థ 2027–28 నాటికి  జర్మనీ, జపాన్‌‌ల ఆర్థిక వ్యవస్థలను దాటి ప్రపంచలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌) పేర్కొంది.  టాప్ పొజిషన్‌‌లో యూఎస్‌‌, చైనా ఆర్థిక వ్యవస్థలు కొనసాగుతాయని తెలిపింది. వేగంగా దేశ ఎకానమీ విస్తరిస్తోందని, మిగిలిన దేశాల కరెన్సీలతో పోలిస్తే  డాలర్ కంటే రూపాయి విలువ తక్కువగా నష్టపోయిందని గుర్తు చేసింది. గతంలో యూకే ఎకానమీని దాటి ఐదో అతిపెద్ద ఎకానమీగా మారినప్పుడు కూడా క్యాపిటల్ ఎకానమిక్స్ ఇలాంటి రిపోర్ట్‌‌నే ఒకటి విడుదల చేసింది. 2030 నాటికి దేశా ఎకానమీ మూడో ప్లేస్‌‌కి చేరుకుంటుందని అప్పుడు ఈ రిపోర్ట్ పేర్కొంది. కరోనా సంక్షోభం,  యుక్రెయిన్‌‌–రష్యా యుద్ధం వలన అభివృద్ధి చెందిన దేశాలు పెరిగిన ఇన్‌‌ఫ్లేషన్‌‌తో ఇబ్బందులు పడుతున్నాయని, ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొద్దిగా పెరగొచ్చని లేదా మాంద్యంలోకి జారుకోవచ్చని వివరించింది. ఇండియా ఎకానమీ కూడా ఈ అంశాల వలన నష్టపోయింది. అయినప్పటికి దేశ ఎకానమీ ఫండమెంటల్‌‌గా బలంగా ఉందని, ఇన్‌‌ఫ్లేషన్ ఎక్కువగా పెరగలేదని వివరించింది.