సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొద్దిరోజులుగా చట్టం, ప్రజాభిప్రాయం చుట్టే విస్తృతంగా చర్చ నడుస్తోంది. దీనికంతటికీ సినిమా పైరసీ నిర్వాహకుడు ఐ బొమ్మ రవి అరెస్టే కారణమని చెప్పొచ్చు. అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు, కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. విస్తృతంగా నెటిజన్ల మధ్య చర్చ కూడా జరుగుతోంది. ఐ బొమ్మ రవి చట్టం దృష్టిలో నేరస్తుడు. ఇది వాస్తవం.. కాదనలేం. కానీ, ప్రజల్లోనైతే హీరోగా మారాడు. చట్ట వ్యతిరేకిని హీరోగా చూస్తున్నారా? లేక చట్టాన్ని కాపాడేవాళ్లను విలన్లుగా భావిస్తున్నారా? అనేంతగా సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన ఉంది. ఇలాంటి వైరుధ్యం ఎందుకు? ఐ బొమ్మ రవిపై జనాల్లో ఎందుకంత సానుభూతి? దీన్ని సామాజిక సమస్య దృక్కోణంలో చూడాల్సి ఉందా? అనే ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంది. ‘పెద్దలను కొట్టి, పేదలకు పెట్టు’ అనే రాబిన్ హుడ్ భావజాలాన్ని అనుసరించినందుకా? సామాన్య కుటుంబానికి చెందిన అతడిలో ప్రజలు చూసినది అదేనా !. అంతగా.. ఐ బొమ్మ రవి అరెస్ట్ చర్చనీయాంశమైంది. ఏదైనా కానీ.. మొత్తంగా చూస్తే.. ఐ బొమ్మ రవి అరెస్ట్ ఘటన తర్వాత చట్టం వర్సెస్ ప్రజాభిప్రాయానికి మధ్యన సంఘర్షణ తలెత్తిందనేంతగా పరిస్థితి మారింది.
ఐ బొమ్మ రవి అరెస్టు ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా, విపరీతంగా చర్చకు పెట్టింది. అతనికి మద్దతుగా నెటిజన్ల పోస్టులు ట్రెండింగ్‌గానూ మారాయి. సినిమా పరిశ్రమపై , పోలీసుల తీరుపై విమర్శలు, ఆగ్రహావేశాలు, వాదనలు, ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. కొందరు సినీ పెద్దలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. సినిమా పైరసీని సమర్థించడం లేదంటూనే, టికెట్, థియేటర్లలో ఫుడ్ రేట్లపై నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అవి సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో లేవని, కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఆకాశన్నంటే ధరల్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్లు అందుబాటులో ఉంటే, ప్రజలు పైరసీ సినిమాలు చూసే పరిస్థితి ఉండదు కదా అనే వాదనకు దిగుతున్నారు.
వినోదామా? విలాసమా?
సినిమా అనేది వినోదామా? విలాసమా? అని కూడా నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. కొందరైతే.. టికెట్ల ధరలు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము సినీ పరిశ్రమ పెద్దలకు ఉందా? అని సవాల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లైతే ఐ బొమ్మ రవి అరెస్ట్ సరికాదంటూ పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు. అతడు చట్ట ప్రకారం చేసినది తప్పే. కానీ, సినీ పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలతో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడడమేంటని మండిపడుతున్నారు. ఏదైనా ఘటన జరిగితే ఇలాగే.. బాధితులను కూర్చోపెట్టుకుని ప్రెస్ మీట్ నిర్వహిస్తారా..? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా, బెట్టింగ్ యాప్స్ మాఫియా ముఠాలతో సంబంధమున్న కొందరు నిర్మాతలు, నటులను అరెస్ట్ చేశారా? అంటూ నిలదీస్తున్నారు.
పాలకులు నైతికత వైపు నిలవాలి!
ఐ బొమ్మ రవి అరెస్ట్ ఘటన ద్వారా చట్టం గొప్ప దా.. ప్రజాభిప్రాయం గొప్పదా? అని చర్చకు లేవనెత్తిన పరిస్థితి నెలకొంది. సినిమా ఒక వినోదం అయితే.. అది విలాసంగా మారినప్పుడు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు. పైరసీ సైట్ నిర్వాహకుడు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడంతోనే సరిపోదు. అతనితోనే పైరసీ ఆగిపోతుందా..? పైరసీ సమస్యకు మూలాలేంటో కూడా గుర్తించాలి. ఐ బొమ్మను క్లోజ్ చేసిన వెంటనే వన్ బొమ్మ సైట్ వచ్చింది. అది బ్లాక్ చేస్తే.. ఇంకో పైరసీ బొమ్మ తెరమీదకు వస్తుంది. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమా పరిశ్రమ పెద్దల దృష్టిలో సరైన నిర్ణయమే కావొచ్చు. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే.. పైరసీ కారణంగా వాళ్ల వ్యాపారానికి తీవ్రనష్టం వస్తుంది. ఇది వాస్తవం. కానీ, ప్రజల వైపు నుంచి ప్రశ్నలు వేరుగా ఉన్నాయి. ఈ రోజుల్లో పేద,మధ్యతరగతి కుటుంబాలు థియేటర్లలో, మాల్స్ లో చేసే ఆర్థిక దోపిడీని తట్టుకుని సినిమా చూడగలరా? ముందుగా దీన్ని ప్రభుత్వం నియంత్రించాలి. ఇందుకు ప్రేక్షకుల శ్రేయస్సు దృష్ట్యా కఠిన నిబంధనలు రూపొందించాలి. ఎప్పుడైనా చట్టం, న్యాయం మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు పాలకులు నైతికతను అనుసరించడమే ప్రజాస్వామ్య ఉత్తమ లక్షణం వైపు మద్దతుగా నిలవాలి. అంతేకాదు ప్రజలకు వినోదం అందించేందుకు తగిన సినిమా ధరలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉంది. ఇకనైనా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దోపిడీకి కొమ్ముకాస్తే..
టికెట్ల రేట్ల పెంపు, థియేటర్లలో, మాల్స్‌లో దోపిడీపై ప్రభుత్వం కొమ్ముకాసి నిర్లక్ష్యం చేస్తున్నంత కాలం ఐ బొమ్మ రవిలు పుట్టుకొస్తూనే ఉంటారు. ప్రజల్లోంచి వ్యతిరేకత ఏ రూపంలోనైనా తలెత్తవచ్చు. అది పోరాట రూపంగానూ మారవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏది మంచి, ఏది చెడు అనేది ప్రజలు వెంటనే గుర్తిస్తున్నారు. ప్రజల మద్దతును పొందాలంటే సామాజిక సమస్యలను సృష్టించే మూలాలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.!
- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్
