కాళేశ్వరం మూడో టీఎంసీకి పెట్టిన పైసలు మునిగినట్టే!

కాళేశ్వరం మూడో టీఎంసీకి పెట్టిన పైసలు మునిగినట్టే!
  • రూ. 20 వేల కోట్లు ధారబోసిన గత బీఆర్​ఎస్​ సర్కార్
  • రూ.33,459 కోట్ల అంచనాలతో 2019లో  పనులు స్టార్ట్
  • ఇప్పటికే 20,372 కోట్లు ఖర్చు.. ఇందులో 17,051 కోట్లు అప్పులే
  • అనుమతుల్లేకుండానే ముందుకు
  • మేడిగడ్డ కుంగడంతో 2 టీఎంసీల నీళ్లూ ఎత్తిపోసుకోలేని పరిస్థితి
  • ఖాళీగా పడి ఉంటున్న మోటార్లు
  • ఇలాంటి స్థితిలో మూడో టీఎంసీ ఉత్తదేనంటున్న ఇంజనీర్లు

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో మూడో టీఎంసీ పనుల కోసం పెట్టిన పైసలన్నీ మునిగినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత బీఆర్ఎస్​  సర్కారు ఈ పనులపై రూ. 20 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ. 17 వేల కోట్లకు పైగా నిధులు అప్పులు తీసుకొచ్చి ఖర్చు చేసింది. అనుమతుల్లేకుండానే పనులు చేపట్టడం.. భూసేకరణకు రైతులు ఒప్పుకోకపోవడం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం.. రిపేర్లు చేసినా బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేకపోవడం.. మోటార్లన్నీ ఖాళీగా ఉండటం వంటి అంశాలు 3వ టీఎంసీ పనులకు ఆటంకాలుగా మారాయని ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెప్తున్నాయి.

మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లే ఎత్తిపోసుకోలేని పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ పడిపోవడం కారణంగా మూడో టీఎంసీపై చేసిన ఖర్చంతా నీళ్లల్లో పోసినట్లేననే భావన అందరిలో కన్పిస్తున్నది.

3వ టీఎంసీ పనులు 2019లో మొదలు

భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌పూర్‌‌లోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 2016  మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు నాటి సీఎం కేసీఆర్​ భూమి పూజ చేశారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. తొలుత గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేసే విధంగా ఏడు లింక్‌‌లు, 28 ప్యాకేజీలుగా విభజించి పనులు మొదలుపెట్టారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.82 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు నీరందించేలా ప్రాజెక్ట్‌‌ రూపకల్పన చేశారు. 2019 జూన్‌‌ 21న మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్​ను కేసీఆర్‌‌ ప్రారంభించారు. అప్పుడే అదనపు టీఎంసీ (మూడో టీఎంసీ) పనులు స్టార్ట్‌‌ చేస్తున్నట్లు ప్రకటించారు. గోదావరి నుంచి రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేవిధంగా పనులు చేపడ్తామని ఆయన చెప్పారు. దీనికోసం రూ. 30 వేల కోట్లకుపైగా కేటాయిస్తున్నట్లు తెలిపారు. దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్​  మరో రూ.47 వేల కోట్లకు పెరిగి రూ.1.27 లక్షల కోట్లు అయింది.

ఇందులో ఫస్ట్‌‌ చేపట్టిన 2 టీఎంసీల పనుల కోసం రూ.73,499 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 3వ టీఎంసీ పనుల కోసం రూ.33,459 కోట్లు కేటాయించగా.. రూ. 20,372 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.17,051 కోట్లు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. అదనపు టీఎంసీ పనుల కోసం కేంద్రం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా పనులు చేపట్టినట్లుగా కాగ్‌‌ తప్పుబట్టింది. అయినా అప్పటి కేసీఆర్‌‌ సర్కారు ఇవేమి పట్టించుకోకుండా.. పనులు చేసినట్లుగా చూపించి బిల్లులు చెల్లించింది. మిగతా పనుల కోసం  జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో భూసేకరణ సమస్యగా మారింది. అక్కడ రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.  

ఒకే కాంట్రాక్ట్‌‌ సంస్థకు రూ. 30 వేల కోట్ల పనులు

గత ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల విలవ గల పనులను టెండర్లు ఏమీలేకుండానే తమకు నచ్చిన కాంట్రాక్ట్‌‌ సంస్థకు ఇచ్చింది. ఇవన్నీ కూడా 3వ టీఎంసీలో భాగంగా చేపట్టిన పనులే. నామినేషన్‌‌ పద్ధతిలో తమకు నచ్చిన కాంట్రాక్ట్‌‌ సంస్థకు ఇచ్చేశారు. వీటిలో వేల కోట్లు బిల్లులు కూడా ఇదివరకే చెల్లించారు. కేసీఆర్‌‌ సర్కారు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో జరిగిన ఈ తంతు విజిలెన్స్‌‌ ఎంక్వైరీలో బయటపడింది.

ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఇంజినీర్లు రూ. కోటి విలువ చేసే పనులు చేయాలంటేనే ఆన్‌‌లైన్‌‌ టెండర్‌‌ పిలుస్తారు. గడువు ప్రకారం వచ్చిన టెండర్‌‌ దరఖాస్తుల్లో అనేక ఆంక్షలు పెడ్తారు. టెండర్లు ఓకే అయ్యాక అగ్రిమెంట్లు చేసుకొని పనులు అప్పగిస్తారు. కేసీఆర్‌‌ సర్కారు హయాంలో ఇవేమీ ఫాలో కాలేదు. తమకు నచ్చిన కాంట్రాక్ట్‌‌ సంస్థకు పనులు అప్పగించిన విషయం విజిలెన్స్‌‌ ఆఫీసర్లు.. సీజ్‌‌ చేసి తీసుకెళ్లిన ఇరిగేషన్‌‌ బుక్స్‌‌ తిరిగేస్తే బయటపడింది. ముఖ్యంగా మూడో టీఎంసీ కోసం చేపట్టిన పనుల్లోనే ఈ భారీ అవినీతి జరిగినట్లు ఇంజినీరింగ్‌‌ నిపుణులు చెప్తున్నారు.

20 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రయోజనమేదీ? 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లోని లింక్‌‌‒1, లింక్‌‌‒2లో చేపట్టిన పనులు, పంప్‌‌హౌస్​‌ల దగ్గర అదనపు మోటార్లు ఏర్పాటు చేసే పేరుతో 3వ టీఎంసీ పనుల దందా జరిపినట్లు తెలుస్తున్నది. కన్నెపల్లి(లక్ష్మీ) పంప్‌‌హౌస్​ ‌వద్ద 2 టీఎంసీల వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేయడానికి 11 మోటార్లు అమర్చగా అదనపు టీఎంసీ కోసం మరో 6 మోటార్లు,  అన్నారంలో 4, సుందిళ్ల పంప్‌‌హౌస్​‌లో 5 అదనపు మోటార్లు బిగించారు.  

లింక్‌‌‒2 కింద ప్యాకేజీ 1, 2, 3, 4 పేరిట కూడా వేల కోట్ల విలువ చేసే పనులు చేశారు. ఇక్కడ కూడా అదనపు మోటార్లు బిగించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రస్తుతం బ్యారేజీలో పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు వాటర్‌‌ స్టోరేజీ చేసే పరిస్థితి లేదని  నేషనల్‌‌ డ్యామ్‌‌ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌‌ఏ) సూచించింది. భవిష్యత్‌‌లో బ్యారేజీ రిపేర్‌‌ చేసినా కూడా 5, 6 టీఎంసీలకు మించి వాటర్‌‌ స్టోరేజీ చేస్తే బ్యారేజీకి ప్రమాదమనే సంకేతాలిచ్చింది.

దీంతో రోజుకు రెండు టీఎంసీల వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేసే సామర్థ్యం కలిగిన మోటార్లకే పని లేనప్పుడు అదనంగా మరో టీఎంసీ వాటర్‌‌ లిఫ్ట్‌‌ చేయడానికి పంప్‌‌హౌస్​లలో మోటార్లను బిగించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. గతంలోనే అదనపు టీఎంసీ పనులు చేయొద్దని నాటి కేసీఆర్‌‌ సర్కారుకు సూచించినా పట్టించుకోకుండా పనులు చేయడం వల్ల రూ. 20 వేల కోట్లు నీటిలో పోసినట్లయిందని నీటి రంగ నిపుణులు అంటున్నారు.