సుప్రీంకన్నా హైకోర్టుల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ: జస్టిస్ అభయ్ ఓకా

సుప్రీంకన్నా హైకోర్టుల్లోనే ప్రజాస్వామ్యం ఎక్కువ: జస్టిస్ అభయ్ ఓకా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కార్యకలాపాలు చీఫ్ జస్టిస్ కేంద్రంగానే జరుగుతున్నాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అభయ్ ఎస్. ఓకా అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొత్త చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ హయాంలోనే ఈ మార్పు వస్తుందని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అభయ్ ఓకా శుక్రవారం రిటైర్ అయ్యారు. ఆఖరి రోజు విధులు నిర్వర్తించిన అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. వాస్తవానికి సుప్రీంకోర్టు కన్నా హైకోర్టులే ఎక్కువ ప్రజాస్వామికంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 

‘‘హైకోర్టులు కమిటీల ద్వారా పని చేస్తున్నాయి. సుప్రీంకోర్టు మాత్రం చీఫ్ జస్టిస్ కేంద్రంగా నడుస్తోంది. ఈ పరిస్థితి మారాలి. కొత్త సీజేఐ హయాంలో ఈ మార్పును మీరు చూస్తారు” అని జస్టిస్ ఓకా చెప్పారు. ఈ నెల 13న రిటైర్ అయిన చీఫ్​జస్టిస్ సంజీవ్ ఖన్నా హయాంలోనూ సుప్రీంకోర్టు బాగా నడిచిందని కొనియాడారు. జస్టిస్ ఖన్నా తమందరినీ పారదర్శక మార్గంలో ముందుకు నడిపించారని తెలిపారు. అలాగే ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ రక్తంలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు. 

ట్రయల్ కోర్టులను విస్మరించొద్దు.. 

సుప్రీంకోర్టు, హైకోర్టులు.. జిల్లా కోర్టులు, ట్రయల్ కోర్టులను విస్మరించాయని జస్టిస్ ఓకా అన్నారు. ‘‘మనం ట్రయల్ కోర్టులు, సామాన్య పౌరుడి గురించి కూడా ఆలోచించాలి. జిల్లా కోర్టులు, ట్రయల్ కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‎లో ఉన్నాయి. ట్రయల్ కోర్టును ఎప్పుడూ సబార్డినేట్ కోర్టు అని పిలవొద్దు. సామాన్యులకు న్యాయం త్వరగా జరిగేలా చూడాలి” అని ఆయన అభిప్రాయపడ్డారు. జడ్జిగా తాను 21 ఏండ్ల, 9 నెలలు పూర్తి చేసుకున్నానని ఈ సందర్భంగా జస్టిస్ ఓకా గుర్తు చేసుకున్నారు.

లాయర్ వృత్తి నుంచి జడ్జిగా మారినందుకు తాను ఎన్నడూ చింతించలేదని చెప్పారు. న్యాయమూర్తిగా ఎక్కువ సంపాదన ఉండకపోవచ్చు కానీ.. ఎక్కువ సంతృప్తి మాత్రం ఉంటుందన్నారు. ఇకపై జడ్జిగా తీర్పులు ఇచ్చే అవకాశం కోల్పోతుండటం మాత్రం జీవితంలో స్వేచ్ఛను కోల్పోతున్నట్టుగా అనిపిస్తోందన్నారు. 

కాగా, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా 1960, మే 25న జన్మించారు. బాంబే యూనివర్సిటీలో బీఎస్సీ, ఎల్ఎల్ఎం చేశారు. అడ్వకేట్‎గా 1983లో ఎన్ రోల్ అయ్యారు. 2003లో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం (ఈ నెల 24) నాటితో రిటైర్ అవుతున్నారు.