కరోనా లెక్కల్లో తిరకాసు..వేల కేసులు దాస్తున్న సర్కార్

కరోనా లెక్కల్లో తిరకాసు..వేల కేసులు దాస్తున్న సర్కార్
  • 42 వేలు దాటిన కేసుల సంఖ్య..
  • 36 వేల దగ్గరే ఆగిన హెల్త్‌‌ బులెటిన్
  • మరణాలు కూడా దాస్తున్నారని ఆరోపణలు
  • టెస్టుల కోసం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
  • ప్రూఫ్స్​ కావాలంటూ ప్రైమరీ కాంటాక్ట్స్​కు సతాయింపులు
  • హోం ఐసోలేషన్​ వాళ్లను పట్టించుకోని ఆఫీసర్లు
  • నిత్యావసరాల కోసం బయట తిరుగుతున్న పాజిటివ్ వ్యక్తులు

హైదరాబాద్‌‌, వెలుగు:కరోనా లెక్కల్లో రాష్ట్ర ప్రభుత్వం తిరకాసు పెడుతున్నది. రోజూ నమోదవుతున్న కేసుల్లో సగం మాత్రమే బులెటిన్‌‌లో ప్రకటిస్తున్నది. వేల సంఖ్యలో కేసులను, వందల సంఖ్యలో మరణాలను దాచి పెడుతున్నది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో 42,685  కేసులు నమోదయ్యాయి.  కానీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్రం బులెటిన్‌‌లో 36,221 కేసులే చూపించింది. సుమారు 6,464 కేసులను ప్రకటించలేదు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలను హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ పోర్టల్‌‌లో అప్‌‌లోడ్  చేస్తారు. అప్‌‌లోడ్ చేసిన వెంటనే ఆర్డర్ ప్రకారం ఓ నంబర్ కేటాయిస్తారు. అట్ల సోమవారం పాజిటివ్‌‌గా తేలిన 19 ఏండ్ల  ఓ అమ్మాయికి  42,684 నంబర్‌‌‌‌ కేటాయించగా..  44 ఏండ్ల ఓ వ్యక్తికి 42,685 నంబర్‌‌‌‌ కేటాయించారు. ఇది సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ ఉన్న అప్‌‌డేట్‌‌. అదే టైమ్‌‌తో పబ్లిక్‌‌ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్‌‌లో కేవలం 36,221 వేల కేసులు నమోదైనట్టుగా చూపించారు. ఇలా వేల సంఖ్యలో కేసులను దాచి పెడుతూ, కేసులన్నీ బయటపెడితే ప్రజలు ఆందోళనకు గురవుతారంటూ సాకులు చెబుతున్నారు. బులెటిన్ల రూపంలో తప్పుడు లెక్కలను ప్రజల్లోకి వదులుతున్నారు. ఇక మరణాల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో కలిపి రోజూ 15 నుంచి 25 మంది చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్య శాఖ బులెటిన్‌‌లో మాత్రం ఇందులో సగం కూడా చూపిస్తలేరు. ఒక్క జూన్ నెలలోనే 380 మంది కరోనాతో చనిపోయినట్టు సమాచారం. కానీ, ఇప్పటివరకూ కరోనాతో 365 మంది మాత్రమే చనిపోయినట్టు సర్కార్ బులెటిన్​ చెబుతోంది

కరోనా టెస్టులు చేయించుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దగ్గుతూ, తుమ్ముతూ తెల్లవారకముందే టెస్టింగ్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు. గంటల తరబడి లైన్‌లో నిల్చున్న తర్వాత.. ఈరోజుకు టెస్టులు అయిపోయాయంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు. పదుల సంఖ్యలో సెంటర్లు పెట్టామని చెబుతున్నప్పటికీ.. ఒక్కో సెంటర్‌‌లో రోజుకు వందకు మించి శాంపిల్స్‌ తీసుకోవడం లేదు. దీంతో రెండు, మూడు రోజులు తిరిగితే తప్ప ప్రభుత్వ దవాఖాన్లలో టెస్ట్‌ చేయించుకునే చాన్స్​ దక్కడం లేదు.

పర్యవేక్షణ బంద్‌

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కూడా సర్కార్ లైట్ తీసుకుంటోంది. మొదట్లో.. ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తెలియగానే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ బాధితుడి ఇంటికెళ్లి వివరాలను తెలుసుకునేవారు. ఇంటి చుట్టూ శానిటైజ్ చేసేవాళ్లు. ప్రైమరీ కాంటాక్టులెవరు, సెకండరీ కాంటాక్టులెవరో తెలుసుకుని లక్షణాలు ఉన్నవాళ్లకు టెస్టులు చేయించేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అసలు పట్టించుకునేవారే ఉండడం లేదు. వైరస్ ఎక్కడి నుంచి అంటుకుంది.. కాంటాక్ట్ వ్యక్తులెవరూ అనేది అసలే పట్టించుకోవడంలేదు. ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులైనా, లక్షణాలున్నా టెస్టుల కోసం తిరగాల్సిందే. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులపై కనీస పర్యవేక్షణ ఉండట్లేదు. దీంతో ఐసోలేషన్‌లో ఉండాల్సిన వ్యక్తులు నిత్యావసరాల కోసం బయటకొస్తున్నారు. ఇంట్లో అందరం కరోనా బారినపడ్డామని, 15 రోజులు బయటకు రాకుంటే తిండికి  వస్తువులెవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

పేషెంటే బయటికి వెళ్లి అన్నీ తెచ్చుకోవాల్సిన దుస్థితి

హైదరాబాద్​లోని హైదర్షాకోట్ల ప్రాంతానికి చెందిన రమేశ్​కు శనివారం కరోనా పాజిటివ్ వచ్చింది. జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే ఉండడంతో ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాలని కిట్‌ ఇచ్చి పంపించారు. 3 రోజులైనా బాధితుడికి హెల్త్, పోలీస్‌, మున్సిపాలిటీ సిబ్బంది నుంచి గానీ, కాల్ సెంటర్ నుంచి గానీ ఫోన్ రాలేదు. ఇంతలో రమేశ్‌ భార్యకు పిల్లలకు కూడా జ్వరం, దగ్గు మొదలైంది. వాళ్లను తీసుకెళ్లి టెస్టులు చేయించే వాళ్లు లేకపోవడంతో, తనే భార్య పిల్లలను తీసుకుని సోమవారం టెస్టింగ్ సెంటర్‌‌కు వెళ్లాడు. కిట్లు ఐపోయాయని, మరో రోజు రావాలని చెప్పడంతో ఇంటికెళ్లిపోయాడు. చాలా మంది ఇలాగే తమకు కావాల్సిన వస్తువుల కోసమో, టెస్టుల కోసమో బయటకు వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కరోనాను కట్టడి చేయాలనే ఆలోచనను సర్కార్ విరమించుకున్నట్టుగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నయి.

టెస్టుల్లో ట్విస్టులు?

నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ పది వేలకుపైగా టెస్టులు చేస్తున్నట్టు హెల్త్ బులెటిన్‌‌లో ప్రకటిస్తున్నారు. కానీ, కేసుల సంఖ్య మాత్రం తగ్గినట్టు చెబుతున్నారు. అంతకుముందు సగటున రోజుకు 5 వేల టెస్టులు చేస్తే సుమారు 1,800 కేసులు నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు పది వేల టెస్టులు చేసినా.. వెయ్యి నుంచి 1500 కేసులు మాత్రమే వస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. ఇందులో ర్యాపిడ్ టెస్టులు ఎన్నో, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎన్నో చెప్పడం లేదు. అసలు ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వివరాలను పోర్టల్‌‌లో అప్‌‌లోడ్ చేస్తున్నారా.. లేదా.. అన్నదీ స్పష్టంగా చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.

ప్రూఫ్స్​ కావాలంటూ తిప్పుతున్నరు

తాము ప్రైమరీ కాంటాక్ట్‌‌ అని, సింప్టమ్స్‌‌ ఉన్నాయని చెప్పినా ప్రూఫ్‌‌ కావాలంటూ వేధిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కూకట్‌‌పల్లికి చెందిన రాకేశ్‌‌ అనే వ్యక్తి కరోనా టెస్ట్‌‌ కోసం సోమవారం ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్‌‌కు వెళ్లాడు. తన కొలీగ్‌‌కు రెండ్రోజుల కింద వైరస్ పాజిటివ్ వచ్చిందని, తనకూ జ్వరం స్టార్ట్ అయిందని చెప్పి టెస్ట్‌‌ చేయాలని కోరాడు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆధార్ కార్డు కావాలని అడగడంతో.. ఆధార్ కార్డు తెప్పించి చూపించారు. ఇద్దరి ఆధార్ కార్డ్‌‌లో సేమ్‌‌ అడ్రస్‌‌ ఉంటేనే టెస్ట్ చేస్తామని, లేదంటే లేదని నిరాకరించారు. కావాలంటే, ఇప్పుడు స్లాట్‌‌ బుక్ చేసుకొని, రెండ్రోజుల తర్వాత టెస్ట్ కోసం రావాలని సూచించారు. అక్కడి నుంచి చెస్ట్ హాస్పిటల్‌‌కు వెళ్లినా ఇదే సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

 తెలంగాణలో మరో 1550 మందికి కరోనా