ఇథనాల్​ ఫ్యాక్టరీ ఉన్నట్లా.. లేనట్లా?

ఇథనాల్​ ఫ్యాక్టరీ ఉన్నట్లా.. లేనట్లా?
  •     పక్షం రోజుల్లో మూడు సార్లు గ్రామస్తుల ఆందోళన
  •     గుగ్గిళ్లలో రెండు నెలలుగా సాగుతున్న వివాదం

బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పష్టత కరువైంది. ఫ్యాక్టరీని నిలిపివేయాలని రెండు నెలలుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎటూ తేల్చడం లేదు. ఆదివారం ఫ్యాక్టరీ స్థలంలో బోరు వేసే ప్రయత్నాలు చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వారం రోజుల క్రితం విద్యుత్​ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయగా గద్దెను కూల్చివేసి రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఎలాంటీ ప్రగతి లేకపోవడంతో గ్రామస్తులు మరోసారి ఆందోళనకు సిద్దం అవుతున్నారు. గుగ్గిళ్ల గ్రామంలో 30 ఎకరాల ప్రైవేటు ల్యాండ్ కొనుగోలు చేసి  గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్  ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్దమైంది.  మొదట విత్తనాల కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తర్వాత  ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ అని తెలియడంతో  గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. 

మొదట పాలక వర్గం తీరుతో రగడ

గుగ్గిళ్ల జీపీ పాలక వర్గం ఫ్యాక్టరీ ఏర్పాటుకు మొదట అనుమతి నిరాకరించింది. తర్వాత రహస్యంగా అనుమతి ఇచ్చింది. దీంతో  ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేసింది. తర్వాత  గ్రామస్తులు ఆందోళనలు చేయడంతో పాలక వర్గం అనుమతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫ్యాక్టరీ యాజమాన్యం పది రోజుల్లో రెండుసార్లు పనులు చేయడానికి యత్నించగా గ్రామస్తులు వాటిని అడ్డుకొని ఆందోళనలకు దిగారు. గతంలో ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఎలాంటి ముందడుగు పడలేదు. 

చెరుకు పిప్పితో ఇథనాల్..?

గుగ్గిళ్లలో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలో చెరుకు పిప్పితో ఇథనాల్ తయారు చేయనున్నట్టు సమాచారం. ఇథనాల్ తయారీ సందర్భంగా విడుదలయ్యే రసాయన జలాలు భూమిలోకి ఇంకి నేలను పాడుచేస్తాయని, ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగ వాతావరణ కాలుష్యానికి కారణం అవుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఫ్యాక్టరీకి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్లు ఇతర అనుమతి పత్రాలను  గ్రామస్తులకు చూపక  పోవడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ విషయంపై కలెక్టర్ స్పష్టత ఇచ్చే వరకు నిరసనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఫ్యాక్టరీని ఇతర ప్రాంతాలకు తరలించాలి

ఇథనాల్ ఫ్యాక్టరీని గుగ్గిళ్ల నుంచి తరలించి ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. దీని వల్ల భూమి, వాతావరణం కలుషితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు ఫ్యాక్టరీని వేరొక ప్రాంతానికి తరలించే వరకు ఆందోళన కొనసాగిస్తాం.

రంగయ్య, గుగ్గిళ్ల

ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పు కోం

కాలుష్యానికి కారణమయ్యే ఫ్యాక్టరీని గుగ్గిళ్ల గ్రామంలో ఏర్పాటు చేయడాన్ని మేము ఒప్పుకోం. ఇప్పటికే  దీనిపై  ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదు. ఫ్యాక్టరీ నిర్మాణంతో గ్రామానికి ముప్పు ఉంటదని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై కలెక్టర్​ వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలి.

నర్సాగౌడ్, గుగ్గిళ్ల

భూములు కలుషితమైతయ్

ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కెమికల్స్​  వల్ల భూములు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. విత్తనాల కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వారికి తగదు. పక్కా ప్లాన్​ ప్రకారమే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

లింగ స్వామి, గుగ్గిల్ల