కాంగ్రెస్కు సీపీఎం అల్టిమేటం.. పొత్తులపై తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ

కాంగ్రెస్కు సీపీఎం అల్టిమేటం.. పొత్తులపై తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ

తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తుల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. కానీ... ఈ పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ రాలేదు. హైదరాబాద్ లో బుధవారం (నవంబర్ 1న) సీపీఎం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొత్తుల అంశంపై సీపీఎం నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. గురువారం (నవంబర్ 2న) మధ్యాహ్నం తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

బుధవారం (నవంబర్ 1న) రోజు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తమకు ఫోన్ చేశారని, సీపీఎం రాష్ట్ర కమిటీలో ఏ నిర్ణయం తీసుకోవద్దని సూచించారని చెప్పారు. పొత్తుల విషయంపై బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం క్లారిటీ ఇస్తామని తమకు చెప్పారని వివరించారు. ఈ  క్రమంలోనే మల్లు భట్టి విక్రమార్క హామీకి విలువ ఇస్తూ.. అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించలేదన్నారు. గురువారం (నవంబర్ 2న) మధ్యాహ్నం 3 గంటలకు తమ వైఖరిని వెల్లడిస్తామని చెప్పారు. ఒకవేళ ఎన్నికల్లో తమతో సీపీఐ పార్టీ వస్తే కలిసి పోటీ చేస్తామన్నారు. ఒకవేళ సీపీఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదిరితే.. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ అభ్యర్థులు ఉండే చోట తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో పెట్టమని అన్నారు.