అలాంటి వారికి దూరంగా ఉండడం కంటే..ఇలా చేస్తే బెటర్

అలాంటి వారికి దూరంగా ఉండడం కంటే..ఇలా చేస్తే బెటర్

ఫ్రెండ్స్​, కొలిగ్స్​​, ఫ్యామిలీ ఫ్రెండ్స్​ ... ఎవరైనా సరే ఒకరినొకరు గౌరవించుకుంటేనే వాళ్ల మధ్య అనుబంధం ఎక్కువ రోజులు ఉంటుంది. కానీ, కొందరు అవతలివాళ్లను టేకెన్​ ఫర్​ గ్రాంటెడ్​గా తీసుకుంటారు. వాళ్ల అభిప్రాయాన్ని లెక్క చేయకపోవడమే కాకుండా మానసికంగా, ఎమోషనల్​గా దెబ్బతీయాలని చూస్తారు. కావాలని మరీ నలుగురిలో  అవమానించడం, తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేస్తుంటారు. దాంతో అలాంటి ఫ్రెండ్స్​, పార్ట్​నర్​ లేదా కొలిగ్స్​కి దూరంగా ఉండాలనుకుంటారు ఎవరైనా. అయితే, వాళ్ల చేష్టలను మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. అలాంటివాళ్లకు  మాటలతోనే  సమాధానం చెప్పాలంటున్నారు సైకోథెరపిస్ట్ సారా కుబ్రుయిక్.

గట్టిగా చెప్పాలి

అవతలివాళ్ల ప్రవర్తన, మాటల వల్ల ఎంతగా ఇబ్బంది పడ్డారో చెప్పాలి. అలాచేయడం వల్ల తమ మధ్య ఉన్న రిలేషన్​షిప్​ ఎలా  దెబ్బతింటుందనేది వివరించాలి. అంతేకాదు ఇకనుంచి అయినా ఇన్​సల్ట్​ చేయడం ఆపేయాలని గట్టిగా చెప్పాలి.

బౌండరీలు పెట్టాలి

 ఇద్దరి మధ్య అనుబంధం పెరగాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం ఎంత ముఖ్యమో వివరించాలి. అంతేకాదు బాధపెట్టే విషయాలు, వ్యక్తిగత వివరాల గురించి మాట్లాడొద్దని పరిధులు పెట్టాలి. అవమానిస్తూ మాట్లాడుతుంటే సైలంట్​గా ఉండకుండా ‘అలా ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించాలి. దాంతో అవతలివాళ్లు హద్దు మీరకుండా ఉంటారు.  

ఆలోచన మారడానికి

ఏదైనా విషయంలో మాటామాటా పెరిగి ఫ్రెండ్స్, కలిగ్స్​తో గొడవ పడాల్సి వస్తే అక్కడి నుంచి వేరే ప్లేస్​కి వెళ్లాలి. అలాచేస్తే మెదడు రిలాక్స్​ అవుతుంది. దాంతో గొడవ పడాలనే ఆలోచన రాదు. ఆ తర్వాత ఆ సిచ్యుయేషన్​లో తప్పు ఎవరిది? అనేది ఇద్దరూ  మాట్లాడుకోవాలి. 

జోక్స్​ వద్దు

కొంతమంది ఫ్రెండ్స్, కొలిగ్స్ మిగతావాళ్ల​ మీద జోక్స్ వేస్తుంటారు. అయితే అన్నిసార్లు ఆ జోక్స్ నవ్వు తెప్పించవు. కొన్నిసార్లు జోక్స్ రివర్స్​ అవుతాయి. దాంతో అవతలివాళ్లు ఇన్​సల్ట్ ఫీలవుతారు. అలాంటప్పుడు ఆ డిస్కషన్​ని అంతటితో ఆపేయాలి. అంతేకాదు  నలుగురు కలిసినప్పుడు ఎవరి మీద కూడా పర్సనల్​ జోక్స్​ వేయొద్దని ముందే ఓ మాట అనుకోవాలి.