కరోనా పేషేంట్లను వారి ఫ్యామిలీలను ఆపతిల ఆదుకునెటోళ్లేరి.?

కరోనా పేషేంట్లను వారి ఫ్యామిలీలను ఆపతిల ఆదుకునెటోళ్లేరి.?
  • దిక్కూ మొక్కు లేక తల్లడిల్లుతున్నకరోనా పేషెంట్లు, వారి ఫ్యామిలీలు
  • అంబులెన్సులు, బెడ్లు కావాలంటూ లీడర్లు, ఆఫీసర్లకు ఫోన్లు


హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్‌ వేవ్‌లో పేదలను, పేషెంట్లను ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. మొన్నటివరకు సాగర్​ బై ఎలక్షన్​, మున్సిపల్​ ఎన్నికలతో హడావుడి చేసిన లీడర్లు ఇప్పుడు జనం కష్టాల్లో ఉంటే కన్నెత్తి కూడా చూడటం లేదు. బెడ్డు కావాలి.. రెమ్డిసివిర్​  కావాలి.. ఆక్సిజన్‌ కావాలి.. ప్లాస్మా కావాలి.. ప్లీజ్ హెల్ప్‌ అంటూ కరోనా పేషెంట్లు, బంధువులు వేడుకుంటున్నారు. రోగం వస్తే ఎటు పోవాలో తెల్వక, ఎక్కడ బెడ్డుందో, ఎక్కడ ఆక్సిజన్ దొరుకుతుందో తెల్వక ఆగమవుతున్నారు. సోషల్  మీడియా గ్రూపుల్లో విజ్ఞప్తులు పెడుతున్నారు. ప్రభుత్వం చెప్పే 104 నంబర్‌‌ ఎప్పుడు కలుస్తుందో తెల్వని పరిస్థితి నెలకొంది. ఆ నంబర్‌‌తో సాయం అందే లోపల పేషెంట్ ప్రాణాలు గాల్లో కలిసేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వేర్వేరు కాల్ సెంటర్లు, టోల్ ఫ్రీ నంబర్లు పెట్టి రోగులకు సాయం చేస్తున్నారు. మన దగ్గర మాత్రం అన్నింటికీ 104కు చేయండి అని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ నంబర్‌‌కు కాల్ కలవడమే గగనంగా మారింది.

ఫస్ట్‌ వేవ్‌లో అనేక మంది వ్యక్తులు, సంస్థలు  ముందుకొచ్చి కరోనా బాధితులకు, వలస కూలీలకు సాయం అందించాయి. భోజనం సప్లయ్​ చేశాయి. కొందరు లీడర్లు కూడా అంతో ఇంతో అండగా నిలిచారు. కానీ, ఈసారి పరిస్థితి విరుద్ధంగా ఉంది. సాయం అందించే సంస్థలు, వ్యక్తులు రాష్ట్రమంతటా వెతికినా వేళ్లపై లెక్కించేంత  కూడా కనిపించటం లేదు. లీడర్లు అసలే ముందుకు రావడం లేదు.  తాము ఫోన్​ చేసి సాయం అడిగినా స్పందించడం లేదని కరోనా బాధితులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమను వెంట తిప్పించుకున్న లీడర్లు, తాము కరోనా బారినపడితే  పట్టించుకోవడం లేదని ఇటీవల కొందరు లోకల్​ లీడర్లు తమ ఆవేదనను వీడియోగా తీసి సోషల్​ మీడియాలో పెట్టారు.  రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సగటున 2 వేల ఎన్జీవోలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో సగం సంస్థలు యాక్టివ్‌గా పనిచేసినా పేద రోగులకు ఎంతో సాయంగా ఉండేది. ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలను కరోనా వార్‌‌లో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నించడం లేదు. ‘‘ఫస్ట్ వేవ్​లో సాయం చేయగలిగినం. సెకండ్‌ వేవ్‌  స్పీడ్​ ఎక్కువగా ఉంది.  ఎవరినీ వదలకుండా కరోనా పట్టిపీడిస్తోంది.. అందుకే సాయం చేయలేకపోతున్నాం..’’ అని కొన్ని సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు. సెకండ్ వేవ్‌లో చాలా మంది ఎన్జీవో ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు.  కొన్ని సంస్థలు తోచిన సాయం చేస్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సాయం ఏమూలకూ చాలడం లేదు.  

ప్లాస్మా కోసం హైదరాబాద్‌‌కు

కరోనా వల్ల నా భార్యకు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడంతో కరీంనగర్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌లో అడ్మిట్ చేసినం. తనకు ప్లాస్మా ఇవ్వాలని డాక్టర్లు చెప్పిన్రు. ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌‌లు పెట్టినం. తెలిసినోళ్లందరినీ అడిగినం. రెండు రోజులు వెతికిన తర్వాత హైదరాబాద్‌‌లో ఒక డోనర్ దొరికిండు. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌‌ వెళ్లి, అక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ వాళ్లతో మాట్లాడుకుని రూ. 25 వేలు పెట్టి ప్లాస్మా తీసుకొచ్చుకున్నం. ప్రభుత్వమే ప్లాస్మా కోసం ఒక హెల్ప్‌‌ లైన్‌‌ పెడితే, ఇలా ప్రతి ఒక్కరినీ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా?
- చంటి, కరీంనగర్‌‌‌‌

ఇతర రాష్ట్రాల్లో ఇట్లా

మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, కేరళ సహా చాలా రాష్ట్రాల్లో బెడ్ల కేటాయింపు దగ్గరి నుంచి మానసిక సమస్యల వరకూ ప్రతి దానికి వేర్వేరు టోల్‌‌ ఫ్రీ నంబర్లు పెట్టారు. కరోనా పేషెంట్లు, వారి కుటుంబీకులకు సాయం చేయడానికి ఆయా రాష్ట్రాల్లో మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవల్ వరకూ ఎక్కడికక్కడ ప్రత్యేకంగా వార్‌‌‌‌ రూమ్‌‌లు పనిచేస్తున్నాయి. ఈ వార్‌‌‌‌ రూమ్‌‌లకు కాల్ చేసి సమస్య చెప్తే, వెంటనే పరిష్కరిస్తున్నారు. పేషెంట్ కండీషన్ చెప్తే ఏ హాస్పిటల్‌‌లో బెడ్లు ఖాళీగా ఉన్నాయో చెప్పి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. రెమ్డిసివిర్, ఆక్సిజన్ వంటివి ప్రతి హాస్పిటల్‌‌కూ, ప్రతి పేషెంట్‌‌కూ అందేలా సెంట్రలైజ్‌‌డ్‌‌ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇంజక్షన్లు, ఆక్సిజన్‌‌ ఏయే హాస్పిటల్‌‌కు ఎంత కేటాయించాలో ప్రభుత్వ యంత్రాంగమే నిర్ణయిం చింది. మన రాష్ట్రంలో  కూడా ఇలా టోల్‌‌ఫ్రీ నంబర్లు, వార్‌‌‌‌ రూమ్‌‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

104 నంబర్​కు నాలుగైదు సార్లు డయల్ చేసి, నిమిషాల తరబడి వెయిట్‌‌ చేస్తే.. అటువైపు నుంచి ‘చెప్పండి సార్/మేడమ్​’ అంటూ సమాధానం వస్తోంది. ‘ఆక్సిజన్ లెవల్స్ తగ్గినయ్​.. ఏ హాస్పిటల్‌‌లో బెడ్లు దొరుకుతయో చెప్పండి’ అని అడిగితే, ‘వెబ్‌‌సైట్‌‌లో వివరాలు ఉన్నాయి చూసుకోండి’ అని చెప్పి కాల్ కట్ చేస్తున్నారు. ‘పేషెంట్‌‌ చావు బతుకుల్లో ఉన్నారు.. డాక్టర్లు రెమ్డిసివిర్​, ఆక్సిజన్‌‌ తెచ్చుకోమంటున్నారు.. ఏంచేయాలో చెప్పండి’ అని అడిగితే, ‘అలాంటి వివరాలు మా దగ్గర ఉండవు’ అని చెప్పి కాల్ కట్ చేస్తున్నారు. ‘అంబులెన్స్‌‌ కోసం 108 కి  కాల్ చేసి నాలుగైదు గంటలు అవుతోంది.. ఇప్పటికీ రాలేదు.. ఏమైనా సహాయం చేయగలరా’ అని అడిగితే.. ‘అంబులెన్స్‌‌ల కోసం 108 నంబర్‌‌‌‌కే చేయాలండి’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు.  ‘మాకు కావాల్సిన సాయం 104 నంబర్‌‌‌‌ ద్వారా చేయలేనప్పుడు ఇంకేదైనా ఆల్టర్నేటీవ్ చెప్పండి’ అని అడిగితే, ‘ఇంకో నంబర్‌‌‌‌ ఏదీ లేదు’ అని అంటున్నారు.