పులులకు జాగ లేదు : చోటు చాలక జనాలపై దాడులు

పులులకు జాగ లేదు : చోటు చాలక జనాలపై దాడులు

ఇరుకైన రణతంబోర్ టైగర్ రిజర్వ్
వేరే చోటుకు తరలించేలా
ఎన్​టీసీఏకి ప్రతిపాదనలు
చోటు చాలక జనాలపై
పులుల దాడులు
ఒక్క నెలలోనే ముగ్గురు మృతి

పెద్ద పులులకు రణతంబోర్​ టైగర్​ రిజర్వ్​(ఆర్​టీఆర్​) ఇరుకైపోయింది. పులుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ చోటు వాటికి సరిపోవట్లేదు. పులుల సంఖ్య ఇంకా పెరిగితే వాటి బతుకు చాలా కష్టమైపోతుందట. అందుకే పెద్ద పులుల సంరక్షణను చూసే నేషనల్​ టైగర్​ కన్జర్వేషన్​ అథారిటీ (ఎన్​టీసీఏ)కి రాజస్థాన్​ వైల్డ్​లైఫ్​ చీఫ్​ వార్డెన్​ అరిందమ్​ తోమర్​ కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. రణతంబోర్​లోని కొన్ని పులులను ముకుందా హిల్స్​ టైగర్​ రిజర్వ్​ (ఎంహెచ్​టీఆర్​), సరిస్కా టైగర్​ రిజర్వ్​ (ఎస్​టీఆర్​), రామ్​గఢ్​ విష్ధారి వైల్డ్​లైఫ్​ శాంక్చువరీకి పంపించాలని కోరారు. ‘‘మా ప్రతిపాదనలకు ఎన్​టీసీఏ ఓకే చెప్పింది. ఎన్ని పులులను ఆయా చోట్లకు తరలించాలో ప్రతిపాదనలు తయారు చేస్తాం. ఆ ప్రతిపాదనలను మరోసారి ఎన్​టీసీఏకి, పర్యావరణ, అటవీ శాఖకు పంపిస్తాం” అని ఆయన వివరించారు.

1700 చదరపు కిలోమీటర్లు

రణతంబోర్​ టైగర్​ రిజర్వ్​ దాదాపు 1700 చదరపు కిలోమీటర్లకుపైనే విస్తరించి ఉంది. అందులో ప్రధాన ప్రాంతం 392 చదరపు కిలోమీటర్లు కాగా, బఫర్​ జోన్​ 1342 చదరపు కిలోమీటర్లు. మొత్తం విస్తీర్ణంలో పులులు తిరిగేది 600 చదరపు కిలోమీటర్లలోనే. ప్రస్తుతం ఆర్​టీఆర్​లో మొత్తం 61 పెద్ద పులులున్నాయి. అందులో 27 మగ పులులు, 24 ఆడ పులులున్నాయి. మిగతా పది పులి కూనలు. ఓ మగ పులి అందాదా 25 చదరపు కిలోమీటర్ల మేర తిరుగుతుంటుందని అధికారులు చెబుతున్నారు. అదే ఆడపులికి అయితే 15 చదరపు కిలోమీటర్లు సరిపోతుందట. ఆ లెక్కన చూసుకున్నా అవి తిరిగే ప్రాంతం వాటికి సరిపోదని అధికారులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్ని యంగ్​ పులులున్నాయో తేల్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
ఇరుకు స్థలంలో ఎన్ని పులులు ఇబ్బందులు పడుతున్నాయో తేల్చనున్నారు. ఆ లెక్కల ఆధారంగా ఎన్ని పులులను వేరే ప్రాంతాలకు తరలించాలో నిర్ణయానికి రానున్నారు.

చంపుతున్నయ్​ లేదా చస్తున్నయ్​

చోటు సరిపోకపోవడంతో టైగర్​ పార్క్​లోకి వెళ్లే జనాలపైన పెద్ద పులులు దాడులు చేస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో పెద్ద పులుల చేతిలో మనుషులు చనిపోతున్నారంటున్నారు. ఇప్పటికే ఈ ఘటనలు ఎక్కువయ్యాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సవాయ్​ మాధోపూర్​, పరిసర జిల్లాల్లో ఒక్క నెలలోనే ముగ్గురిని పులులు చంపాయని గుర్తు చేస్తున్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని చెబుతున్నారు. ఈ దాడులు చేస్తున్నదీ ఎక్కువగా యుక్త వయసులోకి వచ్చిన పులులేనని అంటున్నారు. అది కాకుండా చోటు విషయంలో పులుల మధ్యే గొడవలు జరుగుతున్నాయని, ఆ గొడవల్లోనూ కొన్ని పులులు ఇప్పటికే చనిపోయాయని చెబుతున్నారు. స్థలం గొడవల్లో ఈ ఏడాది రెండు పులులు చనిపోయాయని అంటున్నారు.