కొత్త పెన్షన్ల ముచ్చట్నే లేదు

కొత్త పెన్షన్ల ముచ్చట్నే లేదు
  • మూడేండ్లుగా పట్టించుకోని సర్కార్
  • పాతోళ్లకే 2, 3 వారాలు లేట్ గా డబ్బులు
  • ఈ జులైలో అప్లికేషన్లు తీసుకొని హడావుడి
  • నెలైనా వెరిఫికేషన్ పత్తా లేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు మంజూరైతలేవు. అప్లికేషన్లను మూడేండ్లుగా సర్కారు పట్టించుకోవట్లేదు. పాతోళ్లకే రెండు, మూడు వారాలు లేటుగా డబ్బులిస్తున్న ప్రభుత్వం.. కొత్త వాళ్ల గురించి అసలు ముచ్చట్నే తీయట్లేదు. ఈ జులైలో అప్లికేషన్లు తీసుకొని కాస్త హడావుడి చేసినా నెల రోజులైనా వెరిఫికేషన్​ స్టార్ట్​ చేయలేదు. 57 ఏండ్లు నిండినోళ్ల నుంచి పెన్షన్​ ఇస్తామని మూడేండ్ల కిందట చెప్పిన ఆ హామీని అమలు చేయట్లేదు. వితంతువులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు, గీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పంచాయతీ సెక్రటరీల ద్వారా ఎంపీడీఓలకు అప్లికేషన్ పెట్టుకుని మూడేండ్లుగా ఎదురు చూస్తున్నారు.   

సీఎం చెప్పి 3 నెలలైనా.. 
57 ఏండ్లు నిండినోళ్లకు ఆగస్టు నుంచే ఆసరా పెన్షన్లు ఇస్తామని జులై నెల సిరిసిల్ల పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆగస్టులో ఆసరా ఓల్డేజ్ పెన్షన్​ అర్హత వయసు 57 ఏండ్లకు తగ్గిస్తూ సర్కారు నుంచి జీవో విడుదలైంది. అదే నెల 15 నుంచి 31 వరకు మీ సేవ కేంద్రాల ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. 57 ఏండ్లు నిండినోళ్లు సుమారు 9.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. గడువు ముగిసి నెల రోజులవుతున్నా వెరిఫికేషన్ మొదలుపెట్టలేదు. ఆగస్టులో ఇస్తామన్న పెన్షన్​ అక్టోబర్ లోనూ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. పాత లబ్ధిదారులు 37 లక్షల మందికే ప్రతి నెలా 15, 20 రోజుల లేట్​గా డబ్బులిస్తున్నారు. కొత్తగా సుమారు మరో 15 లక్షల మందికి మరో రూ.350 కోట్లు ఇవ్వడం సర్కారుకు భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నిధులను సమకూర్చడం ఇబ్బందనే పెన్షన్​ మంజూరు లేటవుతోందని తెలుస్తోంది. 

హుజూరాబాద్​లోనేమో జులై నుంచే.. 
సీఎం కేసీఆర్ 2018 సెప్టెంబర్​లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు ఆగింది. 57 ఏండ్లు నిండినోళ్లకు పెన్షన్​ సంగతి పక్కనపెడితే.. వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు  కూడా కొత్తవి మంజూరు చేయట్లేదు. అప్పట్లో 65 ఏండ్లు నిండి ప్రస్తుతం 67, 68 ఏండ్లకు వచ్చిన వృద్ధులకూ మంజూరు కాలేదు. పెన్షన్​ తీసుకుంటున్న వాళ్లలో వివిధ కారణాలతో నెలనెలా నాలుగైదు వేల మంది చనిపోతున్నారు. వీరి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేండ్లలో సుమారు 1.70 లక్షల మందిని జాబితా నుంచి డిలీట్ చేశారు. వీరి స్థానంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయని ప్రభుత్వం.. ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్​లో ఉప ఎన్నిక ఖాయమవడంతో జులైలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. పెండింగ్​లో ఉన్న వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు,  50 ఏండ్లు నిండిన గీత, చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరయ్యాయి. మిగతా ప్రాంతాల వారి వెరిఫికేషన్ పూర్తయి ఆన్​లైన్​లో ఉన్నా ప్రభుత్వం మాత్రం మంజూరు చేయలేదు. 

అప్లై చేసి ఏడాదైంది
నా భర్త సాయిలు నిరుడు సెప్టెంబర్ లో అనారోగ్యంతో చనిపోయిండు. నెల రోజుల తర్వాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని  దరఖాస్తు పెట్టుకున్న. కార్యదర్శి, ఎంపీడీవో ఆన్ లైన్ చేసినమని చెప్పిండ్లు. అప్పటి నుంచి పెన్షన్ వస్తదని చూస్తున్న. ఇప్పటి వరకు రాలె. ఊర్ల సర్పంచ్ ను, సెక్రటరీని అడిగితే ఈ నెల వస్తది, వచ్చే నెల వస్తదంటున్నరు.  
‑ ఎర్నాగి యాదలక్ష్మి, అన్నారం