సుబ్బారావుపై ఆరోపణల్లో వాస్తవం లేదు

సుబ్బారావుపై ఆరోపణల్లో వాస్తవం లేదు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసానికి విద్యార్థులను సుబ్బారావే రెచ్చగొట్టాడని పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో ఆయన అడ్వకేట్ అలెగ్జాండర్ స్పందించారు. సుబ్బారావు పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దాడి జరిగిన రోజు సుబ్బారావు హైదరాబాద్ లోని బోడుప్పల్‌ లో ఉన్నారని తెలిపారు. బోడుప్పల్ లోని అకాడమీ బ్రాంచ్ ఆఫీసు కార్యకలాపాలు చూసుకోవడానికి ఆయన హైదరాబాద్ కు వచ్చారని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే షరతుపై మాత్రమే సుబ్బారావు  ఆందోళనకారులకు మద్దతు ఇచ్చారని అడ్వకేట్ అలెగ్జాండర్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రశాంతంగానే..

ఆంధ్రప్రదేశ్ లో ఆర్మీ అభ్యర్థులు ప్రశాంతంగానే నిరసన వ్యక్తం చేశారని, కేవలం తెలంగాణాలోనే ఇంత విధ్వంసం జరిగిందన్నారు. కార్ఖానా పోలీసులు ఫోన్ చేస్తే.. సుబ్బారావు భయపడి హైదరాబాద్ లో లేనని అబద్ధం చెప్పారన్నారు. సుబ్బారావు నేరం చేశాడన్న ఆధారాలు లేవు కాబట్టే ఇన్ని రోజులు అదుపులో ఉంచుకుంటున్నారని తెలిపారు. సుబ్బారావు కు ప్రాణహాని ఉందని, ఆరోగ్యపరిస్థితి సరిగ్గా లేదని ఆయన అడ్వకేట్ అలెగ్జాండర్ చెప్పారు. గతంలో మిలిటరీలో ఉన్నప్పుడు ఓ యుద్ధ సమయంలో సుబ్బారావు గాయపడ్డారని వివరించారు. సుబ్బారావు తో మాట్లాడించకపోతే కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు.