ఈ సినిమా చూడ్డానికి నెల పడుతుంది

ఈ సినిమా చూడ్డానికి నెల పడుతుంది

సినిమా అంటే రెండు లేదా మూడు గంటల సేపు ఉంటుంది. ఒకప్పుడు నాలుగు గంటల సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా ఒకటుంది. దాన్ని పూర్తి చేయాలంటే నిద్ర పోకుండా నెలరోజుల పాటు చూడాలి. స్వీడన్ ఫిల్మ్ మేకర్స్ ఎరికా, దానియల్ తీసిన ‘లాజిస్టిక్స్' అనే మూవీ రన్ టైం 35 రోజుల 17 గంటలు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా స్వీడన్లోని స్టాక్ హోమ్స్ లో మొదలవుతుంది. అక్కడ షాపులో ఉండే ఒకతను మనకు ఈ గాడ్జెట్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?' అని హీరోని అడుగుతాడు. 

అప్పుడు స్టోరీ మొదలవుతుంది. అడుగులు కొలిచే పెడో మీటర్ మీదకు కెమెరా వెళ్తుంది. అక్కడి నుంచి కథ వెనక్కి వెళ్తుంది. అది కొన్న షాపు, అక్కడికి తీసుకొచ్చిన కంటైనర్, షిప్.. ఇలా కథ చివరిగా చైనాలోని ఒక ఫ్యాక్టరీ వరకూ వెళ్తుంది. సింపుల్గా చెప్పాలంటే పుష్ప' సినిమా టైటిల్స్ లాగ కథ వెనక్కి వెళ్తుందన్న మాట. పెడోమీటర్ చైనాలో తయారై స్టాక్ హోమ్స్ వరకూ రావడానికి ఎన్ని రోజులు పట్టిందో... స్టోరీ కూడా అన్ని రోజులు ఉంటుంది. ఎక్స్ పరిమెంటల్ ఫిల్మ్ కింద 'లాజిస్టిక్స్' సినిమాకు గుర్తింపు వచ్చింది. దీన్ని 72 నిముషాలకు ఎడిట్ చేసి యూట్యూబ్ లో ఉంచారు.