గ్రూప్–4 నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు

 గ్రూప్–4 నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు

గ్రూప్‑4 నోటిఫికేషన్​పై క్లారిటీ రావడం లేదు. మార్చిలో పోస్టుల సంఖ్య ప్రకటించిన సర్కారు, ఆ తర్వాత భర్తీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. త్వరలో.. త్వరలో.. అంటూ కాలం వెల్లదిస్తున్నది. 


హైదరాబాద్, వెలుగు: గ్రూప్–4 నోటిఫికేషన్​పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మార్చిలో పోస్టుల సంఖ్య ప్రకటించిన సర్కారు, ఆ తర్వాత భర్తీ విషయాన్ని పట్టించుకోవడం లేదు. త్వరలో.. త్వరలో.. అంటూ కాలం వెల్లదిస్తున్నది. అయితే రాష్ట్రంలో వీఆర్​ఓల  అడ్జెస్ట్​మెంట్​తో పోస్టులపై కూడా అయోమయం నెలకొన్నది. గతంలో ప్రకటించిన పోస్టులను నింపుతారా.. లేదా.. అనే దానిపైనా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో నోటిఫికేషన్​ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.

లక్షలాది అభ్యర్థుల ఎదురుచూపులు

రాష్ట్రంలో 80వేల పోస్టులను భర్తీ చేస్తామని మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్​ ప్రకటించారు. దీంట్లో గ్రూప్​–4 పోస్టులు 9,168 ఉన్నట్టు వెల్లడించి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ గ్రూప్–4 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుకాలేదు. ఎక్కువ పోస్టులు ఉండటంతో ఈ పోస్టుల కోసం ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్దఎత్తున పోస్టులను నింపడం ఇదే మొదటిసారి. దీంతో ఈసారి ఎలాగైనా జాబ్ సంపాదించాలనే లక్ష్యంతో వేలాది మంది నిరుద్యోగులు ప్రిపరేషన్​ కోసం గ్రామాల నుంచి హైదరాబాద్ బాట పట్టారు.  మేలో అన్ని డిపార్ట్​మెంట్ల అధికారులతో సీఎస్​ సోమేశ్​ కుమార్ సమావేశం నిర్వహించి, అదే నెలాఖరులోగా గ్రూప్–4 ఖాళీల వివరాలు, రోస్టర్ వారీగా ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో జూన్​ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇస్తారనే ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ ఖాళీల వివరాలు పలు డిపార్ట్​మెంట్ల నుంచి రాలేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క 15రోజుల కిందే ఫైనాన్స్ మినిస్టర్​ హరీశ్​ రావు రెండు, మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కానీ గ్రూప్–4 పోస్టుకు ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇప్పటికీ రాలేదు.