పల్లెలకు పురిటి తిప్పలు..సౌకర్యాలు లేక గర్భిణుల నరక యాతన

పల్లెలకు పురిటి తిప్పలు..సౌకర్యాలు లేక గర్భిణుల  నరక యాతన
  •     వాగులు పొంగడంతో బ్రిడ్జీలు లేక దాటలేని పరిస్థితి
  •     సరైన రోడ్డు మార్గమూ లేక అవస్థలు
  •     అంబులెన్స్​రాదు.. వెహికల్స్​వెళ్లలేవు
  •     ఏండ్లుగా గిరిజనులకు అందని మౌలిక వసతులు
  •     టైంకు ట్రీట్​మెంట్ అందక అమాయకుల ప్రాణాలు గాల్లోకి..

ఆసిఫాబాద్, వెలుగు :  వసతుల లేమి అమ్మకు శాపంగా మారుతోంది. అడవుల జిల్లా ఆసిఫాబాద్​లో నడిచే దారి లేక, వాగులపై వంతెనలు కానరాక అడవి బిడ్డలు అరిగోస పడుతున్నారు. సరైన రోడ్డు మార్గాలు, వాగులపై వంతెనలు లేక దవాఖానాలకు ఎడ్ల బండ్ల మీద, ఆటోల్లో రెట్టింపు దూరంలో చుట్టూ తిరిగి వస్తూ నరకయాతన అనుభవిస్తున్నరు. ముఖ్యంగా వానాకాలంలో వాగు ప్రవాహాలు, మోకాలు లోతు బురద మీదకు తెస్తున్నాయి. సౌకర్యాలు లేక గర్భిణులకు ప్రసవం అంటే పునర్జన్మగా మారింది.

బాహ్య ప్రపంచానికి దూరంగా..

జిల్లాలో రోడ్డు, రవాణా సౌలత్​లు లేక ఏటా వానాకాలంలో అనేక గిరిజన గ్రామాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నయి. వంతెనలు పూర్తికాక గర్భిణులు, రోగాల బారిన పడి దవాఖానాకు వెళ్లాల్సిన వారు ఆరిగోస పడుతున్నారు. చింతలమానేపల్లిలోని నాయకపు గుడా వాగుపై రూ.2 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పిల్లర్ల వరకు మాత్రమే నిర్మించి పనులు ఆపేశారు. జులై 23న బాబాసాగర్ ​గ్రామానికి చెందిన దొసంగుల అశోక్(20)కు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి బయల్దేరారు. అయితే ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాన్ని దాటలేకపోయారు. దీంతో ఎటూ వెళ్లలేక, ట్రీట్​మెంట్ అందక అశోక్​ ఇంటి దగ్గరే మృతి చెందాడు. వాగు మీద బ్రిడ్జి నిర్మాణం పూర్తై ఉంటే యువకుని ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మంచంపై దాటించినా దక్కని ప్రాణాలు

కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మలోత్ లక్మణ్ ఈనెల 9న కూలి పనికి వెళ్లి పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు దాటలేని పరిస్థితిలో రెండు గంటల పాటు వాగు వద్దే అవస్థలు పడుతూ ఉన్నాడు. దీంతో స్థానికులు అతడిని మంచం మీద పడుకోబెట్టి అతికష్టం మీద వాగు దాటి కెరమెరి హాస్పిటల్​కు తరలించారు. ప్రాధమిక చికిత్స ఆలస్యం అయి పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి ఆదిలాబాద్​లోని రిమ్స్​కు తరలించారు.  చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గర్భిణికి అడ్డుపడ్డ వాగులు

బెజ్జుర్ మండలంలోని సూస్మీర్, కుశ్నపల్లి వాగులపై వంతెనలు లేవు. కుష్నపల్లి వాగుపై వంతెనకు ప్రతిపాదనలు పంపగా మంజూరు కాలేదు. ఈ నెల 14 న ఇప్పలగూడ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణి ఆత్రం రోజాకు ఫిట్స్ వచ్చింది. దీంతో భర్త సుభాష్, ఇతర కుటుంబీకులు ఆమెను హాస్పిటల్​కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. సూస్మీర్, కుశ్నపల్లి వాగులు ఉప్పొంగడంతో 12 కి.మీ. దూరంలో ఉన్న బెజ్జుర్ పీహెచ్​సీ వెళ్లలేకపోయారు. అంబులెన్స్ ​రాలేని పరిస్థితి. చేసేదిలేక ఆమెను ఆటోలో తలాయి, పాపన్​పేట్ రూట్లలో చుట్టూ తిరిగి తీసుకెళ్లారు.

మార్గ మధ్యలో అంబులెన్స్ రావడంతో పీహెచ్​సీకి తరలించి అక్కడ నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. గిరిజన పల్లెల్లో నిత్యం ఇలాంటి ఘటనలే జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను పూర్తి చేయడంలేదు. 

మేమేం పాపం చేసినం

ఊరు పుట్టినప్పటి నుంచి వాగు కష్టాలు పడుతూనే ఉన్నం. వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులకు, లీడర్లు చెపుతూనే ఉన్నం. ఎవరూ పట్టించుకోవడం లేదు. దవాఖానాకు, నిత్యావసర సరుకుల కోసం కెరమెరి మండలానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. గర్బిణిలు గోస పడుతున్నారు. మేమేం పాపం చేసినం. ఎందుకీ మాకు ఈ గోస.

– మాలోత్ సావిత్రి బాయి, లక్మాపూర్ గ్రామస్థురాలు