సమస్యల్లో సర్కారు బడులు

సమస్యల్లో సర్కారు బడులు
  •     రేపటి నుంచి స్కూల్స్​ రీ ఓపెన్​
  •     టీచర్​ పోస్టుల ఖాళీ, శిథిలావస్థలో క్లాస్​ రూమ్స్​
  •     ఈ ఏడాదీ స్టూడెంట్లకు తప్పని తిప్పలు 

కామారెడ్డి​ ​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో సర్కారు బడుల్లో  సమస్యలున్నాయి. రేపటి నుంచి స్కూల్స్​ రీ ఓపెన్​ అవుతుండగా.. బడుల్లో సమస్యలు మాత్రం తీరలేదు.  టీచర్​ పోస్టుల ఖాళీలతో పాటు, శిథిలావస్థకు చేరిన క్లాస్​ రూమ్స్​, టాయిలెట్స్​ లాంటి ఇతర వసతులు సరిగ్గా లేవు. దీంతో స్టూడెంట్స్​ ఎప్పటి లాగే ఈసారీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జిల్లాలో 1,013 గవర్నమెంట్​ స్కూల్స్​ ఉండగా వీటిలో 83వేల మంది స్టూడెంట్స్​ చదువుతున్నారు. ఈ స్కూళ్లకు మొత్తం  4,943 టీచర్​   పోస్టులు  శాంక్షన్​ అయ్యాయి.  

కానీ,  4,076 మంది  టీచర్లు  మాత్రమే ఉన్నారు. ఇంకా  867 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఎస్జీటీలు ఖాళీగాఉండటంతో   ప్రైమరీ  స్టూడెంట్స్​కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైస్కూల్​ లో సబ్జెక్టు టీచర్లు లేకపోవటంతో బోధనపై ప్రభావం పడుతోంది.    జుక్కల్​, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో  టీచర్​ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయి. వెనుకబడిన జుక్కల్​ నియోజకవర్గంలో టీచర్లు  లేరు. ఇక్కడి నుంచే టీచర్లు పలువురు డిప్యూటేషన్లపై ఇతర ఏరియాలకు వెళ్లారు.  స్కూల్స్​లో అటెండర్​ పోస్టులు కూడా లేవు.దీంతో క్లాస్​ రూమ్స్​ క్లీనింగ్​కు కష్టమవుతోంది. తాత్కాలికంగా వర్కర్స్​ను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల స్టూడెంట్సే  క్లీనింగ్​  చేసుకుంటున్నారు.  

కనీస సౌకర్యాలు కరువు.. 

తరగతి గదుల్లో  రిపేర్లు ఎక్కడికక్కడే ఉన్నాయి.  సుమారు300 వరకు క్లాస్​ రూమ్స్​ శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. వర్షాకాలంలో పైకప్పుల లీకేజీలు, గోడలు పగుళ్లు చూపటం, నేల పగిలిపోపోడంవంటి సమస్యలు  ఉన్నాయి.  వీటికి రిపేర్లు చేయకుండా అలాగే వదిలేశారు. చాలా బడుల్లో  నీటి సౌకర్యం లేక విద్యార్థులు  టాయిలెట్స్​ను వాడటం లేదు. బాత్​రూమ్​లు సరిగ్గా లేక అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. 

అంతంత మాత్రమే పనులు

 ‘మన ఊరు మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగు పరుస్తామని  చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో  కనిపించడం లేదు.   మన ఊరు మన బడి ద్వారా మౌలిక వసతులు కల్పించటం కోసం, క్లాస్​ రూమ్స్​ నిర్మాణం కోసం జిల్లాలో 351 స్కూళ్లను  ఎంపిక చేశారు. వీటి  కోసం  రూ.170 కోట్ల ఖర్చును అంచనా వేశారు. వీటిలో  రూ. 30 లక్షల వ్యయంలోపు పనులు పూర్తయ్యే   స్కూళ్లు 234 ఉన్నాయి.  

ఆ పాఠశాలల్లో పనులు మొదలు  పెట్టినా.  సగం కూడా కంప్లీట్​ కాలేదు.    చాలా చోట్లా క్లాస్​రూమ్స్​ స్లాబ్​ వేసి వదిలేశారు. గోడల నిర్మాణం, టైల్స్​ వర్క్స్​ జరగలేదు. క్లాస్​ రూమ్స్​ శిథిలావస్థకు చేరిన చోట స్టూడెంట్స్​ వర్షకాలంలో బిక్కు బిక్కు మంటు కూర్చోవాల్సి ఉంది. మిడ్​ డే మీల్ బిల్లులను గత ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదు.  ఇప్పటికైనా అధికారులు, లీడర్లు దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి, అవసరమైర రిపేర్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.