అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు.. బిల్లులు రాక ప్రాణం తీసుకుండు

అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు.. బిల్లులు రాక ప్రాణం తీసుకుండు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి గ్రామంలో జరిగింది. చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి (35) గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టాడు. దాదాపు రూ.11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, వీధి లైట్లు ఏర్పాటు చేయించాడు. అయితే..చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని చిదినేపల్లి సర్పంచ్ అంతర్గం రాజమౌళి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే చికిత్స కోసం వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో తిరుపతి చనిపోయాడు. 

అనాథలైన ఇద్దరు పిల్లలు 

గత ఎనిమిది నెలల క్రితం అప్పుల బాధతో తిరుపతి భార్య సరిత కూడా ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో తిరుపతి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. చిదినేపల్లి ఉప సర్పంచి బాలినేని తిరుపతి ఇద్దరు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

నిధుల మళ్లింపుపై సర్పంచుల నిరసనలు

గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.