భార్యను చంపి భర్త సూసైడ్ : నాగోల్​ సాయినగర్​లో ఘటన

భార్యను చంపి భర్త సూసైడ్ : నాగోల్​ సాయినగర్​లో ఘటన
  • భార్యను చంపి.. భర్త సూసైడ్
  • కత్తితో గొంతు కోసి.. రోకలి బండతో కొట్టడంతో భార్య మృతి
  • రెండు అంతస్తుల భవనం పైనుంచి దూకి భర్త ఆత్మహత్య
  • నాగోల్​ సాయినగర్​లో ఘటన 

ఎల్​బీనగర్, వెలుగు : ఓ వ్యక్తి తన భార్యను కత్తితో గొంతు కోసి.. రోకలి బండతో కొట్టి చంపేశాడు. తర్వాత రెండు అంతస్తుల బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో పాటు ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్థలే దీనికి కారణమని తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రాజు (40), కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన కిష్టమ్మ కూతురు సంతోషి (36)తో 15 ఏండ్ల కింద పెండ్లి అయింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. దంపతులిద్దరు తమ పిల్లలతో కలిసి నాగోల్ పరిధిలోని సాయి నగర్ లో ఇల్లు రెంట్​కు తీసుకుని ఉంటున్నారు. కూతురు సింధుజ ఇంటర్ ఫస్ట్ ఇయర్, కొడుకు సాయిరాం 9వ తరగతి చదువుతున్నాడు. 

అనుమానంతోనే..

రాజు, సంతోషి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. సంతోషిపై అనుమానంతో ప్రవర్తన మార్చుకోవాలని రాజు పలుమార్లు హెచ్చరించాడు. సోమవారం సాయంత్రం రాజు తన ఫ్యామిలీతో కలిసి సరూర్​నగర్ గ్రీన్​పార్క్ కాలనీలో ఉంటున్న తన చెల్లె మంజుల ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి అక్కడే భోజనం చేసి రాజు, సంతోషి బైక్​పై సాయినగర్​లోని తన ఇంటికొచ్చేశారు. ఇద్దరి మధ్య రాత్రి గొడవ జరిగింది. రాజు ఆవేశంతో సంతోషి మెడను కత్తితో కోసి పక్కనే ఉన్న రోకలి బండతో కొట్టడంతో ఆమె స్పాట్​లోనే చనిపోయింది. తర్వాత రాజు మళ్లీ బైక్​పై సరూర్​నగర్ లోని తన చెల్లె మంజుల ఇంటికి వెళ్లాడు. 

నిద్రమత్తులో ఉండటంతో ఎన్ని సార్లు తలుపు కొట్టినా మంజుల తీయలేదు. తర్వాత అదే బిల్డింగ్​లోని రెండో ఫ్లోర్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున చుట్టుపక్కవాళ్లు గమనించి మంజులకు చెప్పారు. సంతోషికి ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో మంజుల బంధువులు సాయినగర్ వెళ్లారు. తాళం పగులగొట్టి చూడగా.. సంతోషి చనిపోయి కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంతోషి, రాజు డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్​కు తరలించారు. మంజుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.