భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు

భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రాహుల్ యాత్ర ఏర్పాట్లపై ఓ హోటల్ లో మెదక్, సంగారెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. నారాయణఖేడ్ లో కాంగ్రెస్ ఓటమికి నువ్వే కారణమంటే నువ్వే కారణమని ఒకరినొకరు దూషించుకున్నారు. అక్కడే ఉన్న  ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావీద్, దామోదర రాజనర్సింహ.. ఇద్దరు నాయకులకు సద్ది చెప్పారు. మీడియా ప్రతినిధుల ముందు గొడవ పడొద్దని, ఏదైనా ఉంటే బయట చూసుకుందామంటూ నచ్చజెప్పారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. నిన్నటితో నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ఇవాళ 31వ రోజు టుముకూరు జిల్లాలోని తిప్టూర్  గ్రామం వద్ద  ప్రారంభం అయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న  భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దారిపొడవునా ప్రజలను పలుకరిస్తూ.. క్షేమ సమాచారాలు ఆరా తీస్తూ ముందుకు సాగుతున్నారు. దేశ  ప్రజల సౌభాగ్యం కోసం.. ప్రజలను ఐక్యం చేయడం కోసం యాత్ర చేపట్టినట్లు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. 

గత సెప్టెంబర్ నెల 8వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి రోజు 25 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. మొత్తం ఐదు నెలల్లో 12 రాష్ట్రాలలో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. 

కర్ణాటకలోనే రాహుల్ ఓటు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే పాదయాత్ర చేస్తున్న ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ ఓటు వేయనున్నారు. అధ్యక్ష బరిలోకి దిగిన శశిధరూర్, మల్లికార్జున ఖర్గే ఇద్దరూ పోటీ పడుతుండడంతో ఎన్నిక అనివార్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఎన్నికలు జరిగే నాటికి రాహుల్ గాంధీ పాదయాత్ర బళ్లారి జిల్లాలో ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో రాహుల్ గాంధీతోపాటు పాదయాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు 40 మంది వరకు పాదయాత్ర స్థలం నుంచే ఓటు వేసే అవకాశం ఉంది.

వీరి కోసం రాహుల్ పాదయాత్రా స్థలంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. అయితే కర్ణాటకకు చెందిన పీసీసీ సభ్యులు బెంగళూరులో ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అథారిటీ నిర్ణయించిందని.. ఆ రోజున రాహుల్ యాత్రకు విరామం ఉంటుందని ఆయన చెప్పారు. ఈనెల 19న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటన జరుగుతుందన్నారు.