ఎఫ్ 35 జెట్‎ల కొనుగోళ్లపై చర్చ జరగలే.. పార్లమెంట్‎లో వెల్లడించిన కేంద్రం

ఎఫ్ 35 జెట్‎ల కొనుగోళ్లపై చర్చ జరగలే.. పార్లమెంట్‎లో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోళ్లపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాంగ్రెస్​ఎంపీ బల్వంత్ బస్వంత్ ​వాంఖడే అడిగిన ప్రశ్నకుగాను విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్​సింగ్​శుక్రవారం లోక్​సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎఫ్​35 కొనుగోళ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందులో పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. ఎఫ్ 35 యుద్ధ విమానాలను ఇండియాకు సప్లయ్​చేసేందుకు తాము రెడీగా ఉన్నామని ట్రంప్​ ప్రకటించారు. అయితే.. ట్రంప్​ తాజాగా భారత్​పై 25 శాతం టారిఫ్‎లు, అదనంగా పెనాల్టీలు విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతున్నదన్నది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎఫ్​35 విమానాల కొనుగోళ్లపై కాంగ్రెస్​ ఎంపీ వాంఖడే లోక్​సభలో  ప్రస్తావించగా.. అమెరికాతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్రం ప్రకటించింది.