
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాల మీద విచారణ కొనసాగుతోందని, ఆ రిపోర్టుల ఆధారంగా.. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫార్ములా ఈ – కార్ రేస్ వంటి వాటిపై విచారణ సంస్థలే చర్యలు తీసుకుంటాయని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు.
పక్క రాష్ట్రాల్లో రోజుకు నలుగురు మాజీమంత్రులు, ఎంపీలు అరెస్ట్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ ఎంక్వైరీ కమిటీలు వేసి రిపోర్టులను సిద్దం చేస్తోందని, దోషులుగా తేలిన వారిపై చర్యలు తప్పవన్నారు. కాళేశ్వరం, ఈ–కార్ రేస్, ధరణిలో దోచుకున్న సొమ్మునంతా రికవరీ చేసి పేదలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయలేదని విమర్శించారు.