కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే

కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) దేశంలోని1254 కేంద్రీయ విద్యాలయాల్లో 2024- 25 విద్యా సంవత్సరానికి 1వతరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభమైంది. ఒకటో తరగతికి మాత్రమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నారు. రెండు, ఆపై తరగతుల్లో చేరే వారికి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ణయించారు. 1వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు కచ్చితంగా మార్చి 31 నాటికి తప్పని సరిగా ఆరేళ్లు పూర్తై ఉండాలి.


ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో ఎంచుకున్న ప్రాదాన్యత ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికత ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఎలాంటి ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఉండదు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలు ఫస్ట్ లిస్ట్‌ ఏప్రిల్‌ 19న, రెండో లిస్ట్‌ ఏప్రిల్‌ 29న, మూడో లిస్ట్‌ మే 8న విడుదల చేయనున్నారు. రెండో తరగతితో పాటు ఆపై తరగతులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 1 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్‌10 వ తేదీ సాయంత్రం 4గంటల వరకు అవకాశం ఉంటుంది. సంబంధిత కేంద్రీయ విద్యాలయకు వెళ్లి ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.