
శుక్రవారం వస్తే థియేటర్ల దగ్గర మొదలయ్యే సందడి ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కనిపిస్తోంది. వారమంతా ఏదో ఒక కొత్త సినిమానో, వెబ్ సిరీసో స్ట్రీమింగ్‌కి వస్తూనే ఉన్నా.. స్పెషల్ ప్రాజెక్టులన్నీ ఫ్రైడే రిలీజ్ కోసం ఖర్చీఫులు వేస్తున్నాయి. దాంతో వీకెండ్ వార్ యమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటోంది. ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజవుతున్నాయి. ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ మూవీ ఈరోజు నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. మానసిక సమస్యతో బాధపడే అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఆల్రెడీ థియేటర్లలో రిలీజయ్యింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ‘బిగ్‌బాస్’ ఫేమ్ దివి నటించిన ‘క్యాబ్ స్టోరీస్’ స్పార్క్ ఓటీటీలో రిలీజవుతోంది. వైభవ్, వాణీభోజన్, కరుణాకరన్ తదితరులు నటించిన తమిళ మూవీ ‘మలేషియా టు అమ్నీషియా’ జీ5లో విడుదలవుతోంది. ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో రిలేషన్ పెట్టుకోవాలనుకుంటాడు. దానివల్ల ఏర్పడే పరిణామాలు ఏమిటనేది కథ. ఇక అమెరికన్ కామెడీ డ్రామా ‘క్రుయెల్లా’ ఇవాళ డిస్నీ ప్లస్‌లో విడుదల కానుంది. ‘101 డాల్మేషన్స్’ మూవీకి ఇది ప్రీక్వెల్. ఎమ్మా స్టోన్, ఎమ్మా థాంప్సన్ లీడ్ రోల్స్ చేశారు. రోడ్ ట్రిప్‌లో కలిసిన ఇద్దరు టీనేజర్స్ మధ్య ఏర్పడే రిలేషన్‌షిప్, ఆ తర్వాత ఎదురయ్యే అనుభవాలే కథాంశంగా తీసిన ఇంగ్లిష్ మూవీ ‘ప్లాన్ బి’ కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక యానిమేషన్ మూవీ ‘డాగ్ గాన్ ట్రబుల్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. కోటీశ్వరుల పెంపుడు కుక్క అయిన ట్రబుల్ ఓరోజు అనుకోకుండా తప్పిపోతుంది. ఆ తర్వాత దానికి చాలా కష్టాలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటూ సొంతంగా జీవించడం ఎలా నేర్చుకుంది అనేది కథ. వీటితో పాటు కొన్ని వెబ్ సిరీసులు కూడా ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యాయి. హ్యుమా ఖురేషీ నటించిన ‘మహారాణి’ హిందీ సిరీస్ సోనీ లివ్ ద్వారా స్ట్రీమ్ కానుంది. ముఖ్యమంత్రికి భార్య అయినా ఏమీ తెలియని అమాయకురాలు రాణి భారతి. ఉన్నట్టుండి భర్త తన పదవికి రాజీనామా చేసి, ఆమెని సీఎం క్యాండిడేట్‌గా అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె లైఫ్ ఎలా టర్న్ అయ్యిందనేది స్టోరీ. యాంగ్జయిటీ డిజార్డర్ చుట్టూ తిరిగే ‘ప్యానిక్’ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లోను, ఆరు కథలతో అల్లిన ‘లాంచ్‌ప్యాడ్’ సిరీస్ డిస్నీ ప్లస్‌లోను స్ట్రీమింగ్‌కి వస్తున్నాయి. ఫేమస్ హాలీవుడ్ స్టార్ మైఖేల్ డగ్లస్ నటించిన ‘ద కోమిన్‌స్కీ మెథడ్’ మూడో సీజన్ కూడా ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.