
అన్ని రకాల పోషకాలు ఉన్న డైట్ మెదడును చురుకుగా ఉంచుతుంది. మెమరీ పవర్‌ను పెంచుతుంది. అందుకే పిల్లలకు న్యూట్రియెంట్స్ సరిపడా అందే ఫుడ్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ల మెదడు షార్ప్‌గా పని చేస్తుంది అంటున్నారు డైటీషియన్ విధి చావ్లా. ఓట్స్ మంచి ఎనర్జీ ఫుడ్. మెదడుకు ఫ్యూయల్‌గా పనిచేస్తుంది కూడా. వీటిలోని ఫైబర్ పొట్ట నిండిన ఫీల్‌ని ఇస్తుంది. కిడ్స్ జంక్‌ఫుడ్ తినకుండా చేస్తుంది. ఓట్స్‌లోని విటమిన్–ఇ, బి–కాంప్లెక్స్, జింక్ పిల్లల బ్రెయిన్‌ను షార్ప్‌గా చేస్తాయి. ఓట్మీల్లో యాపిల్, అరటి పండు, బ్లూ బెర్రీలు లేదా బాదం కలిపి తినిపిస్తే మరీ మంచిది. ఆయిలీ ఫిష్‌లో ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్‌కు, డెవలప్మెంట్కు ఉపయోగ పడతాయి. సాల్మన్, ఫ్రెష్ ట్యూనాల్లో ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. అందుకే ఈ చేపలను వారానికి ఒకసారి పిల్లలకు తినిపించాలి. పాలు, పెరుగు, జున్ను వంటి వాటిలో ప్రొటీన్, బి–విటమిన్ బాగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనానికి ఎంతో అవసరం. కొందరు పిల్లలు పాలు తాగనని మారాం చేస్తుంటారు. అలాంటి వాళ్లకు పాలతో తయారుచేసిన అంబలి లేదా జావ, పాన్కేక్ వంటివి ఇవ్వాలి. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, తక్కువ క్వాంటిటీలో హెల్దీ ఫ్యాట్స్ కాంబినేషన్ ఉన్న డైట్ తినిపించాలి. గుడ్డు తింటే సరిపడా ప్రొటీన్ దొరుకుతుంది. అలాగే మెమరీ పవర్‌ను పెంచే కొలైన్ అనే పోషకం కూడా అందుతుంది.