మంత్రాల నెపంతో కొట్టి చంపారు..డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో కాల్చేసి పరార్

మంత్రాల నెపంతో కొట్టి చంపారు..డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో కాల్చేసి పరార్
  •      నిర్మల్ జిల్లాలో వృద్ధుడి హత్య కేసులో ఇద్దరు అరెస్ట్

ఖానాపూర్, వెలుగు: మంత్రాల నెపంతో వృద్ధుడిని హత్య చేసి, డెడ్‌బాడీని కాల్చి వేసిన ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. కేసు వివరాలను నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి శనివారం వెల్లడించారు. కడెం మండలం గండి గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన మూతి నరేశ్‌, మల్లేశ్‌ అన్నదమ్ములు. వీరి తల్లి కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. 

ఇందుకు గ్రామానికి చెందిన డి.భీమయ్య(60) మంత్రాలు చేయడమే కారణమని అనుమాంచి చంపేందుకు ప్లాన్‌ చేశారు. ఈనెల10న భీమయ్య తన ఇంటి ముందు చలిమంట కాగుతుండగా నరేశ్‌, మల్లేశ్‌ వెళ్లి కర్రతో దాడి చేశారు. బాధితుడి తల్లి అడ్డుకునేందుకు యత్నించగా ఆమెను కూడా కొట్టారు. చనిపోయిన భీమయ్యను సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి కాల్చివేశారు. అనంతరం నిందితులు పారిపోయారు. 

మృతుడి కూతురు లక్ష్మి ఫిర్యాదుతో కడెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఖానాపూర్ సీఐ అజయ్, కడెం ఎస్ఐ సాయి కిరణ్‌ ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు.