
ఈ అంశం వారి పరిధిలో ఉండదు: ప్రియాంకా గాంధీ
న్యూఢిల్లీ: నిజమైన భారతీయులు ఎవరని చెప్పేది జడ్జీలు కాదని, ఇది వారి పరిధిలో లేని అంశమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఇండియన్ ఆర్మీ, దేశం అంటే.. రాహుల్ గాంధీకి ఎంతో గౌరవమని తెలిపారు.
దేశానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట అనలేదని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే, సవాల్ చేసే అధికారం తన అన్న రాహుల్ గాంధీకి ఉందని, ఆ విధి నిర్వర్తిస్తున్నారని చెప్పారు.
రాహుల్‌ను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా చేసిన కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘‘రాహుల్‌కు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉంది. సుప్రీం కోర్టు.. గౌరవనీయులైన జడ్జిలపై రెస్పెక్ట్ ఉంది.
రాహుల్ ఏం మాట్లాడినా.. రాజకీయ కోణంలో చూడొద్దు. ఓ ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రాన్ని ప్రశ్నించే అధికారం మా అన్నకు ఉన్నది. ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సైనికుల గురించి రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా.. వారి త్యాగాలు, కీర్తి ప్రతిష్టలను పొగిడారే తప్ప.. అగౌరవపర్చలేదు’’ అని ప్రియాంకా గాంధీ అన్నారు.