
నోబెల్శాంతి బహుమతి ప్రదానంపై అమెరికా అక్కసు వెళ్లగక్కింది. వెనుజులా లీడర్ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై తీవ్ర విమర్శలు చేసింది వైట్‌హౌస్. నోబెల్ కమిటీ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతికంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రయార్టీ ఇచ్చిందని ఆరోపించింది.
ట్రంప్ ఎన్నో శాంతి ఒప్పందాలు చేశారు.. ఎన్నో యుద్దాలు ఆపారు..ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.. గొప్ప మానవతావాది.. మానవతా హృదయం గలవారు.. సంకల్ప శక్తితో పర్వతాలను కూడా కదిలించే సామర్థ్యం ఆయనకు ఉంది.. అలాంటి లీడర్ ఎప్పటికీ దొరకరు. అటువంటి లీడర్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదని.. నోబెల్ శాంతి కమిటీ రాజకీయం చేసిందని వైట్ హౌస్ ప్రతినిధి స్వీవెన్ చియుంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో పోస్ట్ చేశారు.
శుక్రవారం ( అక్టోబర్10) ఉదయం ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా నాయకురాలు మారియా కొరినా మచాడో గెలుచుకున్నారు. జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచినందుకు మరియా కొరినా మచాడోను ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రకటించింది.
అక్టోబర్ 7, 1967న జన్మించిన మచాడో..వెనిజులా ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘనలను తీవ్రంగా విమర్శించింది. దేశంలో ప్రజాస్వామ్యం, శాంతి స్తాపనకు కీరోల్ పోషించింది. మచాడో 2002లో సుమాటే అనే పౌర సంస్థను సహ-స్థాపించి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె 2011 నుంచి 2014 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు.
2013లో ఆమె ఉదారవాద ,ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా వెంటే వెనిజులా అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తన కెరీర్ మొత్తంలో మచాడో మానవ హక్కులకోసం పోరాడారు. వెనిజులాలోని నిరంకుశ పాలనను ఎదురించి నిలబడినందుకు ఆమెకు ఈ గుర్తింపు లభించింది.